-భాదితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం…
-ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి. సిసోడియా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను తక్షణ సహాయక చర్యలు అందించేలా అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని కొండచరియలు విరిగిపడిన సంఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి. సిసోడియా తెలిపారు.
నగరంలోని మొగల్రాజపురం సమీపంలోని సున్నపు బట్టీల ప్రాంతాన్ని శనివారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి. సిసోడియా, జిల్లా కలెక్టర్ డా. జి. సృజనతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమైన సంఘటనన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు సూచించామన్నారు. ఇటువంటి సంఘటలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించమన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు చెరువులు పొంగిప్రవహిస్తున్నాయని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అవసరమైన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్నామన్నారు. ముంపుకు గురైన ప్రాంతాలలో డ్రైన్ల పూడిక తీసి వర్షపు నీటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యతనిచ్చి అంటురోగాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి. సిసోడియా తెలిపారు. పరిశీలనలో మున్సిపల్ కమీషనర్ హెచ్ఎం. ధ్యానచంద్ర, విజయవాడ ఆర్డీవో బీహెచ్ భవాని శంకర్, తహశీల్ధార్ రోహిణి ఉన్నారు.