– సహాయ చర్యలకు ప్రత్యేక అధికారుల నియామకం.
– లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలింపు.
– పునరావాస కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు
– గౌరవ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నాం.
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షం తగ్గుముఖం పట్టినా.. ముంపు ముంచెత్తడంతో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టామని.. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు.
ఆదివారం కలెక్టరేట్‌లో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ; భూగర్భ, గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామమోహన్, బొండా ఉమామహేశ్వరరావు, కలెక్టర్ డా. జి.సృజన తదితరులు సమావేశమయ్యారు. జిల్లాలో ముంపు ప్రభావం, దాన్ని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు, పునరావాస కేంద్రాల ఏర్పాటు, పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు, అక్కడ సౌకర్యాల కల్పన తదితరాలపై చర్చించారు. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వర్షంకారణంగా తలెత్తిన ముంపు సమస్యను చక్కదిద్దేందుకు ప్రణాళికాయుతంగా తీసుకున్న చర్యలను కలెక్టర్ సృజన.. గౌరవ ప్రజాప్రతినిధులకు వివరించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ ప్రతిక్షణం అప్రమత్తతతో మార్గనిర్దేశనం చేస్తున్నట్లు తెలిపారు. పైనుంచి వరద ప్రవాహాన్ని అంచనాలను విశ్లేషించుకుంటూ ముంపు ప్రమాదం పొంచిఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, మందులను అందించడంతో పాటు మరుగుదొడ్లు వంటి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇందుకోసం ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు. బుడమేరు వాగుకు వరద పెరగడంతో ప్రభావిత ముంపుబారిన పడిన ప్రాంతాల్లోనో సహాయకచర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు తదితరాలను గుర్తించి, పునరావాసానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఏదైనా విజ్ఞప్తి రాగానే తక్షణం స్పందించేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
వైద్య శిబిరాలూ ఏర్పాటు:
ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వీలుగా జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గుర్తించిన ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సృజన తెలిపారు. గర్భిణీలను ఆసుపత్రులకు తరలించి.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. డ్రెయినేజీ వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. మంచి నీటి పైపులైన్లు ఎక్కడా లీకేజీలు లేకుండా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గౌరవ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారిశుద్ధ్య చర్యల విషయంలోనూ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. నిధిమీనా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్ తదితరులు పాల్గొన్నారు.