అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో నూతన క్షిపణి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర రక్షణ వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆనంద దాయకమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షిపణి పరీక్షలకు అత్యంత అనుకూలమైన ప్రదేశంగా నాగాయలంక మండలం గుల్లలమోద ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ ద్వారా ఎంపిక చేయగా గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో భూములు కేటాయించారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రహరీ నిర్మించి పర్యావరణ అనుమతులు సాధించారన్నారు. గత ప్రభుత్వంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాపనకు వస్తారని హెలిపాడ్ సిద్ధం చేసినప్పటికీ గత ప్రభుత్వం సహకారం లేకపోవడంతో పనులు ముందుకు సాగలేదన్నారు. తాజాగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ సహకారాలు అందించడంతో ఈ క్షిపణి కేంద్రం సాకారం అయినట్లు తెలిపారు. నాటి డీ.ఆర్.డీ.ఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి ఈ క్షిపణి కేంద్రం మంజూరు నాటి నుంచి నేటి వరకు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందించారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు పర్వదినం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారధ్యంలోని హై లెవల్ సెక్యూరిటీ కమిటీ నిర్ణయం తీసుకొని గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రం మంజూరు చేయటం ద్వారా అవనిగడ్డ నియోజకవర్గానికి మహత్తర ప్రాజెక్టు ఇచ్చిందన్నారు. ఈ కేంద్రం మంజూరులో ప్రధాన కారకులు సతీష్ రెడ్డి అని ప్రశంసించారు. తమ నియోజకవర్గంలో రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల నిధులు ఇచ్చే ప్రాజెక్టు మంజూరు చేసిన దేశ ప్రధాని నరేంద్రమోడీకి బుద్ధప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని సెక్యూరిటీ కమిటీ కౌన్సిల్ ఈ గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. క్షిపణి పరీక్షలకు అనువైన భూ పరిసరాలు, అనుకూల వాతావరణం గుల్లలమోదలో ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. అనేక ప్రయత్నాల మేరకు అనేక డిజైన్లు, వనరులు పరిశీలించి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ విస్తృతంగా చర్చించి ఈ క్షిపణి పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఈ క్షిపణి పరీక్ష కేంద్రం గుల్లలమోదులో ఏర్పాటు చేయడం ద్వారా అవనిగడ్డ నియోజకవర్గంతో పాటు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. దీంతోపాటు ఆ కేంద్రానికి అనుబంధంగా ఉండే ల్యాబ్స్, ఇంటర్నేషనల్ సెంటర్లు, సప్లై పరిశ్రమలు ఏర్పడి సెకండరీ ఎంప్లాయిమెంట్ అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయన్నారు. ఈ కేంద్రాన్ని మంజూరు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి, దేశ రక్షణ శాఖ మంత్రికి ఆయన ధన్యవాదములు తెలిపారు. త్వరితగతిన ఈ కేంద్రం గుల్లలమోదలో ఏర్పడి దేశానికి మరిన్ని క్షిపణులు అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News