Breaking News

ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి

– పొలం పిలుస్తోంది.. కార్య‌క్ర‌మాలను ప్ర‌ణాళికాయుతంగా నిర్వ‌హించాలి
– త‌క్కువ పెట్టుబ‌డితో అధిక దిగుబ‌డులు సాధించేలా రైతుల‌ను చేయిప‌ట్టి న‌డిపించండి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మ‌న ఆరోగ్యవంత‌మైన జీవ‌నానికి స్వ‌చ్ఛ‌మైన ఉత్ప‌త్తులు అందించ‌డంతో పాటు ప‌ర్యావ‌ర‌ణానికీ మేలుచేసే ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై అధికారులు ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని, ప్ర‌కృతి వ్య‌వ‌సాయ విధానాల‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు.
బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ సేద్య విభాగాల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లాలో వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాల కార్య‌క‌లాపాల‌ను ఆయా శాఖ‌ల అధికారులు వివ‌రించారు. జిల్లాలో ప్ర‌ధాన వ్య‌వ‌సాయ‌, ఉద్యాన పంట‌ల సాగు విస్తీర్ణం; ఎరువులు, విత్తనాల నాణ్యత పరీక్షలు; సీసీఆర్‌సీ కార్డుల పంపిణీ, పంట రుణాలు, పంట‌ల బీమా త‌దిత‌రాల‌పై స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌కృతి వ్య‌వ‌సాయంలో జిల్లాను నెం.1 స్థానంలో నిలిపేందుకు కృషిచేయాల‌న్నారు. రైతుల‌కు అధిక ఆదాయం ల‌భించే ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగుపైనా రైతుల‌ను ప్రోత్స‌హించాల‌న్నారు. ప‌త్తి వంటి పంట‌ల్లో అంత‌ర పంట‌ల‌తో రైతుల‌కు అధిక ఆదాయం ల‌భిస్తుంద‌న్నారు.
వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విలువను పెంచే ఉద్దేశంతో మెరుగైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు అందుబాటులో ఉన్న Ind GAP certificationపైనా రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. రైతులు పంట‌ల సాగులో ఎదురయ్యే ఇబ్బందుల‌ను అధిగ‌మించి, అధిక దిగుబ‌డులు సాధించేలా, వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటిగా మార్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌తి మంగ‌ళ‌, బుధ‌వారాల్లో స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్‌కే) సిబ్బంది, గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ఆర్ఎస్‌కే – ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ స‌జావుగా జ‌రిగేలా అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. జి.కొండూరు, మైల‌వ‌రం, రెడ్డిగూడెం, తిరువూరు, ఎ.కొండూరు, విస‌న్న‌పేట‌, విజ‌య‌వాడ రూర‌ల్ మండ‌లాల్లో మామిడి ప్ర‌ధాన ఉద్యాన పంట‌గా ఉంద‌ని అధికారులు వివ‌రించారు. అదేవిధంగా జ‌గ్గ‌య్య‌పేట‌, పెనుగంచిప్రోలు, వ‌త్స‌వాయి, నందిగామ‌, చంద‌ర్ల‌పాడు, వీరుల‌పాడు, గంప‌ల‌గూడెం మండ‌లాల్లో మిర్చి ప్ర‌ధాన ఉద్యాన పంట‌గా ఉన్న‌ట్లు తెలిపారు. నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ (ఎన్ఎంఈవో)-ఆయిల్‌పామ్ కింద జిల్లాలో పంట వైవిధ్యంలో భాగంగా 2 వేల హెక్టార్లు మేర ఆయిల్‌పామ్‌ను విస్త‌రించాల్సిన ఉన్నందున‌.. ఆ ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి, రైతు సంక్షేమానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న కార్య‌క్ర‌మాల అమ‌ల్లో జిల్లాను ముందు వ‌రుస‌లో నిలిపేందుకు కృషిచేయాలని స్ప‌ష్టం చేశారు.
స‌మావేశంలో జిల్లా వ్య‌వ‌సాయ అధికారి డీఎంఎఫ్ విజ‌య‌కుమారి, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్‌, ఏపీఎంఐపీ పీడీ పి.ఎం.సుభాని త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *