గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 13, 14, 15 తేదీల్లో అంగరంగ వైభవంగా, తెలుగు సంప్రదాయాలను నేటి తరానికి తెలియచేసేలా నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంస్థల సహకారంతో నిర్వహిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ గల్లా మాధవి తో కలిసి బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో సంక్రాంతి సంబరాల ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలను నిర్వహించనున్నామన్నారు. ఎంఎల్ఏ గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో చిన్నారుల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ అలరించేలా సంబరాలను రూపొందిస్తున్నామని, కార్యక్రమాల వివరాలు త్వరలో తెలియచేస్తాన్నారు. సంబరాల నిర్వహణకు అధికారులు, నగర ప్రముఖులతో నిర్వహణ కమిటిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సంబరాలు జరిగే స్టేడియంలో మౌలిక వసతుల కల్పనకు త్వరగా చర్యలు తీసుకోవాలని డిఈఈని ఆదేశించారు. సంబరాల్లో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఎంఎల్ఏ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరిగే తొలి సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. సంబరాల్లో పాల్గొనే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సంబరాల్లో బొమ్మల కొలువు, చేనేత వస్త్ర ప్రదర్శన స్టాల్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. సంబరాల్లో సాంప్రదాయకంగా, సంస్కృతిని చాటేలా ప్రతి ఒక్కరూ ఆనందంగా పాల్గొనేలా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని సూచించారు.
సమావేశంలో డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, కార్పొరేటర్లు మానం పద్మశ్రీ, ఈరంటి వరప్రసాద్, స్టేడియం మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ ముత్తినేని రాజేష్, లాల్ వజీర్, గురు దత్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News