Breaking News

పేదలకు మేలు చేసేలా 22ఏ భూములపై నిషేధం ఎత్తివేత

-ఈనెల 20వ తేదీ నుండి రీ సర్వే తిరిగి ప్రారంభం
-ఈసారి పకడ్బందీగా రీ సర్వే
-దొంగ పాసు పుస్తకాల స్కాంలో నిందితులైన ఎమ్మార్వోలపై చర్యలు
-సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
-ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు మేలు చేసేలా 22 ఏ భూములపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ జిల్లాలో ఎన్నెన్ని భూములు 22 ఏ కింద ఉన్నాయని, అవి ఏ కేటగిరీల కింద ఉన్నాయో మూడు రోజుల్లో నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గత ప్రభుత్వంలో భూ యజమానులను ఇబ్బంది పెట్టి వారి భూములు లాక్కునేందుకు అక్రమంగా ఆ భూములను 22 ఏ కింద పెట్టారని, వాటన్నింటినీ నిషేద జాబాతి నుండి తొలగించాలని ప్రజా ప్రతినిధుల నుండి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం నాడు జోన్ 2, జోన్ 3కి సంబంధించిన 11 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మరియు ఆ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రెవెన్యూ అంశాలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ర్ట రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ పి సిసోదియా, సిసిఎల్ఎ జయలక్ష్మీ, అడిషనల్ సిసిఎల్ఎ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.

ఈ సమీక్ష అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టంలో 22ఏ అనేది ప్రధాన సమస్యగా మారిందని, గత ప్రభుత్వం 22ఏ ను దుర్వినియోగం చేసిందని అన్నారు. అక్రమంగా కొందరి భూములను 22ఏలో చేర్చారని అన్నారు. వీటన్నింటకీ పరిష్కారంగా 22 ఏ లో ఉన్న భూములపై నిషేధాన్ని త్వరలోనే తొలగిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో 22 ఏ భూములను నిబంధనలకు విరుద్దంగా నాలుగున్నర లక్షల ఎకరాలను నిషేధం నుండి తప్పించారని, వాటిల్లో ఏడు వేల ఎకరాలను అక్రమంగా రిజిస్టర్ చేశారని చెప్పారు. ఈ రిజిస్ర్టేషన్నింటీనీ రద్దు చేస్తామని చెప్పారు. వీటిల్లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు కూడా తీసుకుంటామన్నారు. కొందరు ఎమ్మార్వోలు అవినీతికి పాల్పడి దొంగ పాస్ పుస్తకాలు పుట్టించి బ్యాంక్ లోన్ కుంభకోణానికి కారణమయ్యారని, వారిపైన కఠిన మైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈనెల 20 తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని చెప్పారు. అప్పటి నుండి 45 రోజుల లోపు ఈ సదస్సుల్లో వచ్చిన గ్రీవెన్స్ ను పరిష్కరిస్తామని చెప్పారు. ఈనెల 20 తేదీ నుండి రీ సర్వేను తిరిగి ప్రారంభిస్తామన చెప్పారు. గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ఈసారి చాలా పకడ్బందీగా రీ సర్వే నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి మండలంలో గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని రీసర్వే చేస్తామని, ఇందులో అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొంటారని చెప్పారు. ఎలాంటి హడావిడి లేకుండా ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా రోజుకు 20 ఎకరాలు మాత్రమే ఒక టీమ్ రీ సర్వే చేస్తుందని చెప్పారు. రీ సర్వే జరిపిన గ్రామాల్లో సభలు నిర్వహిస్తే లక్షా 80 వేల ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నంటినీ కూడా పరిష్కరించి వారికి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పారు. మిగిలిన వారికి సంక్రాంతి పండుగ తర్వాత కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ పాస్ పుస్తకంపై రాజముద్రతోపాటు క్యూర్ కోడ్ ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కాగా ప్రాంతీయ సదస్సుకు మంత్రులు కొలుసు పార్థసారధి, గొట్టిపాటి రవి కుమార్ కూడా హాజరయ్యారు. వీరితో తోపాటు హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ 22 ఏ జాబితాలో అక్రమంగా ప్రజల భూములను చేర్చారని, వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే ఈనామ్, ఎస్టేట్ బూములను సెటిల్ చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఫారెస్ట్, రెవెన్యూ భూముల మద్య స్పష్టమైన సరిహద్దులను నిర్ణయించాలని కోరారు. పట్టణాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న సామన్యులకు వెనువెంటనే రెగ్యలరైజ్ చేయాలని కోరారు. జగన్న కాలనీల్లో అవినీతిని వెలికి తీసి నిజమైన లబ్దిదారులకు త్వరగా ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలని కోరారు.

Check Also

సమర్ధవంతంగా శాప్ విధులు

-ప్రణాళికాబద్ధంగా క్రీడల అభివృద్ధి -త్వరితగతిన క్రీడాభివృద్ధి పనులు -స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో శాప్ ఛైర్మన్ రవినాయుడు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *