-ప్రణాళికాబద్ధంగా క్రీడల అభివృద్ధి
-త్వరితగతిన క్రీడాభివృద్ధి పనులు
-స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో శాప్ ఛైర్మన్ రవినాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా శాప్ అధికారులు సమర్ధవంతంగా పనిచేయాలని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. శాప్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో శాప్ అధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శాప్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడాభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. ఆయా జిల్లాల్లో శాప్, ఖేలో ఇండియా, కేంద్రప్రభుత్వ నిధులతో చేపడుతున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాలు, క్రీడావికాస కేంద్రాలు, స్పోర్ట్స్ ఎరీనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. క్రీడాభివృద్ధి పనులకు సంబంధించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి నివేదించాలన్నారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలపై దృష్టి సారించాలని, ఆయా జిల్లాల్లో జరుగుతున్న పనుల విషయంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్స్, ఖేలో ఇండియా గేమ్స్, ఏషియన్ గేమ్స్ నిర్వహించే విధంగా ఆయా జిల్లాల్లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడం మనందరి బాధ్యతని గుర్తు చేశారు. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడం, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారుచేయడమే సీఎం చంద్రబాబునాయుడు గారి ఆశయమన్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా సమష్టి కృషితో పనిచేయాలని ఆయన సూచించారు. క్రీడాకారుల భవిష్యత్తే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, దానికి అనుగుణంగా క్రీడా సంఘాలు, శాప్ అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుని క్రీడాకారులకు అన్ని విధాలుగా తోడ్పాటునందించాలన్నారు.
Prajavartha Online Telugu News