విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం తనకి ప్రకటించిన ఆర్థిక సాయం అందించకుండా నిర్లక్ష్యం వహించిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ఆర్థిక సాయం ఇప్పించి ప్రోత్సహించాలని పర్వతాహరోహకుడు రామావత్ చిన్నికృష్ణ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను కోరారు. గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం రామావత్ చిన్నికృష్ణ ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి గత ప్రభుత్వంలో తనకి జరిగిన అన్యాయం వివరించారు. అనంతపురం జిల్లా పామిడి మండలం పాళ్యం తండాకు చెందిన రామావత్ చిన్ని కృష్ణ నాయక్ ఇప్పటి వరకు హిమాలయ పర్వత ప్రాంతంలో రేనాక్ పర్వతాన్ని, జుమ్ముకాశ్మీర్ లో బైసరన్ పర్వతాన్ని, 2018లో దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని, రష్యా లోని ఎల్బరస్ పర్వతాన్ని అధిరోహించినట్లు ఎంపి కేశినేని శివనాథ్ కి తెలిపారు. అలాగే హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ , మల్టీ టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్ అవార్డ్ సాధించిన రామావత్ చిన్ని కృష్ణను ఎంపి కేశినేని శివనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టి కి ఈ సమస్య ను తీసుకువెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని చెప్పటంతో పాటు అన్ని విధాలుగా అండగా నిలుస్తానని ఎంపి కేశినేని శివనాథ్ భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్చూరి ప్రసాద్, టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, టిడిపి నాయకులు అబీద్ హుస్సెన్ పాల్గొన్నారు.