విజిలెన్స్, ఏసీబీ, శాఖాపరమైన విచారణలు వేగవంతం చేయాలి

-ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉంచడం ఏమిటి?
-ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి… వాటి వివరాలేమిటో నివేదిక సిద్ధం చేయండి
-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  ఆదేశాలు

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
‘ఉద్యోగుల పనితీరు మీద సున్నితమైన విజిలెన్స్ ఉండాలి. వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు అది ఓ సూక్ష్మదర్శనిలా పని చేస్తుంది. అయితే ఉద్యోగులపై నమోదు అవుతున్న విజిలెన్స్ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలు ఏళ్ల పాటు పెండింగ్ లో ఉండిపోవడం ఉద్యోగుల పని తీరుపై ప్రభావం చూపిస్తుంది’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  స్పష్టం చేశారు. క్రమశిక్షణ చర్యలు, శాఖపరమైన విచారణలకు సంబంధించినవి ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అంశంపై ఉప ముఖ్యమంత్రివర్యులు దృష్టి సారించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ది, ఆర్.డబ్ల్యూ.ఎస్., అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న విజిలెన్స్, ఏసీబీ, శాఖాపరమైన కేసుల వివరాలు, అవి ఎంత కాలంగా పెండింగ్ లో ఉన్నాయి, అందుకుగల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబందిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. కొన్ని కేసులు 20 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న విషయం పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. ఈ విధంగా కేసులు అపరిష్కృతంగా ఉండటం మూలంగా అధికారులు, సిబ్బంది, ఉద్యోగ విరమణ తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేదు. సిబ్బంది తమ ఉద్యోగ కాల పరిమితిలో పదోన్నతుల్లోనూ వెనుకబడిన వారున్నారని గ్రహించారు.
ఈ క్రమంలో విజిలెన్స్ పెండింగ్ కేసులపై నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  ఆదేశించారు. అభియోగాలు వచ్చిన వారిపై విచారణ ప్రారంభించినపుడు దానికి తగిన పత్రాలు అందుబాటులో ఉండటం లేదనీ, ఇది విచారణ జాప్యానికి కారణం అవుతోందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ తన శాఖల పరిధిలో విజిలెన్స్ రిపోర్టుల ఆధారంగా తీసుకునే చర్యల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను సూచించారు. ఏదైనా విషయంలో అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వస్తే ప్రాథమిక విచారణ పకడ్భందీగా జరపాలన్నారు. ప్రాథమిక విచారణలోనూ బలమైన సాక్ష్యాలు సేకరించాలని, విచారణాధికారికి, ఆరోపణలు వచ్చిన ఉద్యోగికి మధ్య సన్నిహిత సంబంధాలు లేకుండా తొలి దశలోనే నిరోధించాలని స్పష్టం చేశారు. శాఖల్లోని అన్ని విజిలెన్స్, నాన్ విజిలెన్స్ కేసులను సరైన, సక్రమమైన రీతిలో తిరిగి విచారించి వేగంగా వాటిని పరిష్కరించేందుకు శాఖాధిపతులు దృష్టి సారించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *