-మన ఆరోగ్యం నగర పరిశుభ్రతతో కాపాడుకుందాం- గద్దె రామ్మోహన్ రావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు
-నగర పరిధిలోని 64 వార్డులలో విస్తృతంగా చేపట్టిన స్వచ్ఛ దివస్ – డాక్టర్ డి చంద్రశేఖర్, నగర ఇంచార్జి కమిషనర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన ఇంటిని ప్రతిరోజు పరిశుభ్రంగా ఎలా ఉంచుకుంటున్నామో అలాగే పరిసరాలని నగరాన్ని అంతకంటే ఎక్కువగా పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అన్నారు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా సూచనలతో విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ శనివారం నగర పరిధిలో గల 64 వార్డులలో విస్తృతంగా స్వచ్ఛత దివస్ ను నిర్వహించారు.
సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు, పశ్చిమ నియోజకవర్గం భీమనవారి పేటలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మారుతి కో-ఆపరేటివ్ కాలనీ లో గద్దె రామ్మోహన్ రావు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛత దివస్ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రపరిచారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్వచ్ఛత మీద చైతన్యం కలిగిస్తూ, ప్రజలను శుభ్రత పట్ల కట్టుబడి ఉండాలని ప్రోత్సహించారు.ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ద్వారానే మన విజయవాడను ప్రగతిశీల నగరంగా, శుభ్రమైన నగరంగా మార్చగలుగుతాం అన్నారు. ఈ కార్యక్రమం మన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తుందని అన్నారు. స్వచ్ఛత దివస్ సందర్భంగా నగర పరిశుభ్రత కొరకు తాము ప్రతిజ్ఞ చేస్తూ, అక్కడ వచ్చిన వారిని ప్రతిజ్ఞ చేయిస్తూ నిత్యం వ్యర్ధాలు పడే ప్రదేశంలో రంగులు వేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు.
చేతితో చీపురు పట్టుకుని ప్రదేశాలను పరిశుభ్రపరిచారు, దోమలను నియంత్రించేందుకు ఏలూరు కాలువలో డ్రోన్ నడిపి ఎమెల్ ఆయిల్ స్ప్రే చేసి స్వచ్ఛత దివస్ సందర్భంగా తమ వంతు బాధ్యత నిర్వహించానని తెలిపారు.
ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛత మన అందరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నగరాన్ని స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దాలని, విజయవాడ నగరపాలక సంస్థ వారితో సహకరించాలని, వ్యర్ధాలను కేవలం చెత్తబుట్టలోనే వేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ మన ఆరోగ్యం, మన పిల్లల భవిష్యత్తు కోసం శుభ్రతను మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వలన ఆయురారోగ్యాలతో ఉండొచ్చని, మన భావితరాలకు మనం ఇవ్వగలిగినది ఏదైనా ఉందంటే అది కేవలం స్వచ్ఛతతో కూడిన పరిశుభ్రమైన నగరం అని అన్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 64 వార్డులలోను విస్తృతంగా స్వచ్ఛత దివస్ ని నిర్వహించి, 286 సచివాలయ పరిధిలో కూడా నిత్యం వ్యర్ధాలు పేరుకుపోయే ప్రదేశాలను పరిశుభ్రపరిచి వాటిని అందంగా తీర్చిదిద్దుతున్నామని, డ్రైనేజీలో పేరుకుపోయిన వ్యర్థాలను పూడికలను తీసి డ్రైనేజ్ ప్రవాహాన్ని నిరంతరాయంగా వెళ్ళేటట్టు చూస్తున్నారని, నగరంలో నిత్యం వచ్చే వివిధ రకాల దెబ్రీస్, చెట్ల వ్యర్ధాలు ప్రతి సచివాలయం పరిధిలో సిబ్బంది ప్రజల సహకారంతో పరిశుభ్రపరుస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, RDO చైతన్య కుమార్, కార్పొరేటర్ల దేవినేని అపర్ణ, జోనల్ కమిషనర్ ప్రభుదాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటనారాయణ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, పాల్గొన్నారు.