-పిజిఆర్ఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసిన జిల్లా కలెక్టర్
కడప, నేటి పత్రిక ప్రజావార్త :
మైదుకూరు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తూర్ల విష్ణు వందన కుటుంబానికి.. ఇచ్చిన హామీలను 24 గంటల్లోపే తీర్చేందుకు.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబందిత అధికారులతో కలిసి తక్షణ చర్యలు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మరింత బలం చేకూరేలా.. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యక్షంగా అందిన వినతుల పట్ల జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తక్షణమే స్పందించారు. వినతులు అందిన 24 గంటల్లోపే అర్జీదారులకు పరిష్కార నివేదికను అందివ్వడం జరిగింది. వివరాల్లోకి వెళితే..
స్వర్ణ ఆంధ్రా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా.. స్వచ్ఛత దివస్ (ప్రతి నెల 3వ శనివారం) అమలుకు శ్రీకారం చుట్టేందుకు శనివారం మైదుకూరు మున్సిపాలిటీకి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినాయకనగర్ లో నివాసముంటున్న వేల్తుర్ల విష్ణు వందన నివాసాన్ని సందర్శించారు. తడిచెత్త, పొడిచెత్తను వేరు చేసి.. చెత్త ద్వారా సంపదను సృష్టించవచ్చు అన్న.. ప్రభుత్వ సూచనలను తూచా పాటిస్తూ ఇంట్లోనే కిచెన్ గార్డెన్, పూల మొక్కలను పెంచుతూ.. ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిన గృహిణీ విష్ణు వందనను అభినందిస్తూ.. వారి కుటుంబ జీవన స్థితిగతులను, కుటుంబ సభ్యుల విద్య ఉద్యోగ ఉపాధి ఆదాయ వనరులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వందన కుటుంబ సభ్యులు వారి కుటుంబ జీవనం మెరుగు కోసం, కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకు… ప్రభుత్వ సాయం కోరుతూ వినతి పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేయడం జరిగింది. వారికి తప్పక సాయం చేస్తామని హామీఇస్తూ.. అర్హతలను బట్టి వెంటనే.. వారి కుటుంబానికి అవసరమైన సహకారాన్ని అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి అదేశించడం జరిగింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ద్వారా.. సంబంధిత అధికారులతో మాట్లాడి.. 24 గంటల లోపే అర్జీదారుల కుటుంబానికి పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే.. ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ తోకలిసి విష్ణు వందన నివాసానికి వెళ్లారు. ఆ కుటుంబానికి సంబంధించి మొత్తం 6 వినతులు అందగా.. రెండింటిని వెంటనే తీరుస్తూ మిగతా వాటికి సంబంధించి.. వారి అర్హతలు, ప్రభుత్వ నిబంధనలు, షరతులకు లోబడి వారు కోరిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
1) వి.సుబ్బారాయుడుకు డిఆర్డీఏ ద్వారా వృద్దాప్య పెన్షన్ మంజూరు చేస్తూ అనుమతి పత్రాన్ని అందించడం జరిగింది.
2) రెండు కాళ్ళు పనిచేయని లక్ష్మీదేవికి డిఎంహెచ్ఓ, ఆరోగ్యశ్రీ ద్వారా.. ప్రభుత్వం నుండి వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది.
3) ఉపాధి కోసం వెల్డింగ్ మిషన్ కోసం ఆర్థిక సాయం కోరిన సుబ్బారాయుడుకు పరిశ్రమల శాఖ, మెప్మా ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు వారి నుండి కొటేషన్ కూడా తీసుకోవడం జరిగింది.
4) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విష్ణు వందనకు నైపుణ్యాలను పరిశీలించి డిఆర్డీఏ శాఖలో ఔట్ సోర్సింగ్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు.
5) జీవనోపాధి మెరుగు కోసం టాక్సీ వాహనం (ఎత్రిగా) కొనుగోలు చేసేందుకు.. వి.నాగేంద్ర బాబుకు ఆర్థిక సాయం అందించేందుకు బీసీ కార్పోరేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది.
6) బి.టెక్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న నీరజ్ చందుకు.. అర్హత ప్రమాణాలను బట్టి.. జాబ్ మేళా సమయంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారికి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందించిన వెంటనే.. ఆయన ఇచ్చిన హామీల మేరకు.. 24 గంటల్లోపే క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జిల్లా అధికారులు తమ ఇంటికొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు తీసుకోవడం అభినందనీయం అని.. విష్ణు వందన కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిజిఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ) విధానం.. అర్జీదారుల్లో ప్రభుత్వంపై మరింత నమ్మకాన్ని పెంపొందిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో.. డిఆర్డీఏ, మెప్మా పీడీలు ఆనంద్ నాయక్, సురేష్ రెడ్డిలు, బీసీ కార్పోరేషన్ ఈడీ జయసింహ, స్థానిక రెవెన్యూ, మున్సిపల్, మెడికల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News