-ఒక్క అవకాశం అంటూ… విద్యుత్ వ్యవస్థ విధ్వంసం
-సూర్యఘర్ పథకం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు
-నాణ్యమైన విద్యుత్ సరఫరా చూసి ఓర్వలేకున్న జగన్
-ఢిల్లీ స్థాయిలో తెలిసిన జగన్ విధ్వంసం
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక్క అవకాశం అంటూ ప్రజలను మోసం చేసి గత ఐదేళ్లు అధికారం చేపట్టిన జగన్… రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టడమే కాకుండా.. ఎస్సీ, ఎస్టీలకు అందించే ఉచిత విద్యుత్ విషయంలోనూ విష ప్రచారం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. దళిత, గిరిజనుల ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ నేతలు సాక్షి పత్రికలో ప్రచారం చేయడాన్ని మంత్రి ఖండించారు. గత ఐదేళ్లు విద్యుత్ వ్యవస్థపై కక్ష పెట్టుకున్న జగన్.. దానిని విధ్వంసం చేసినా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనా అనుభవంతో అనతికాలంలోనే సరిదిద్దారని ఆయన తెలిపారు. రైతులకు వ్యవసాయ అవసరాలకు 9 గంటలు నిరంతరాయ విద్యుత్ తో పాటు ప్రజలకు నాణ్యమైన కరెంట్ ను ఎటువంటి అంతరాయాలూ లేకుండా కూటమి ప్రభుత్వం అందించడాన్ని చూసి… సైకో జగన్ తట్టుకోలేక పోతున్నాడన్నారు. ఫీడర్ లెవల్ లోనే రైతులకు అందుతున్న నాణ్యమైన విద్యుత్ ను.. జగన్ అండ్ కో… వైసీపీ బ్యాచ్… తమ అసత్య ప్రచారాలతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. కుప్పం నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సూర్యఘర్ పథకాన్ని త్వరలోనే రాష్ట్రం అంతటా అమలు చేస్తామని ప్రకటించారు. అదే విధంగా సూర్యఘర్ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సౌర ఫలకాలను ఉచితంగానే అమర్చుతున్నామని తెలిపారు. ఎటువంటి అదనపు భారాలు లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే సూర్య ఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాల అమలుతో జగన్ కు వచ్చిన నష్టమేంటే ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి సవాలు విసిరారు.
జగన్ విధ్వంసం కేంద్ర పెద్దల దృష్టికి…
గత ఐదేళ్ల పాలన సాక్షిగా… జగన్ చేసిన విధ్వంసం కేంద్ర పెద్దల ద్రుష్టికి కూడా వెళ్లిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. దేశంలో జరిగే అభివృద్ధి సంబంధ విప్లవాత్మకమైన మార్పులను అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందు ఉంటారని ఆయన వెల్లడించారు. అదే విధంగా ఎటువంటి మంచి పథకంపైన అయినా… విషం చిమ్మి వ్యవస్థలను నాశనం చేసే విషయంలో జగన్ ముందు ఉంటాడని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో… జగన్ గర్వంగా చెప్పుకునే పథకం ఒక్కటైనా ఉందా అంటూ వైసీపీ నేతలను మంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేంద్ర – రాష్ట్ర ప్రాయోజిక పథకాలైన.. సూర్య ఘర్, పీఎం కుసుమ్ అమలుతో విద్యుత్ వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. సూర్యఘర్ పథకంలో విద్యుత్ గృహ వినియోగదారులకు, పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సంబంధించి వ్యవసాయ వినియోగానికి నాణ్యమైన విద్యుత్ అందడంతో పాటు మిగులు కరెంట్ ను గ్రిడ్ కు పంపి వినియోగదారులు ఆర్థికంగా వెసులుబాటు పొందే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. పథకాలు పూర్తి స్థాయి అమలు తరువాత వాటి ప్రయోజనాలు మరింతగా ప్రజలకు చేరతాయని మంత్రి స్పష్టం చేశారు. అవినీతిలో కూరుకుపోయిన గత వైసీపీ ప్రభుత్వం.. నిర్లక్ష్యం చేసిన పథకాలను… కూటమి ప్రభుత్వం అందిపుచ్చుకుని.. ప్రజలకు లబ్ధి చేకూరేలా వాటిని అమలు చేస్తుంటే ఓర్వలేని వైసీపీ మూకలు… సాక్షి పత్రికను అడ్డం పెట్టుకుని సంక్షేమ పథకాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ఇటువంటి విష ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు.