Breaking News

రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి… : ఏపీఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమల రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా నిలుస్తున్న రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఏపీఆర్టీసీ ఎండీ, మాజీ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో 75 సంవత్సరాల రాజ్యాంగం, వేవ్స్ సదస్సు, మహిళా భద్రత గురించి విజయవాడ లోని ఏపీఎస్ ఆర్టీసీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన “ఆకాశవాణీయం” ప్రత్యేక పుస్తకాన్ని ఆకాశవాణి విజయవాడ డిప్యూటి డైరెక్టర్ జనరల్ ఎమ్.సోమేశ్వరరావు, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపాటితో కలిసి ఆవిష్కరించారు. అంతకు ముందు 75 సంవత్సరాల భారత రాజ్యాంగ విశేషాలను తెలిపే ఛాయ చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని అన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమని తెలిపారు. పాత్రికేయులు కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

అనంతరం, విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కె.జి.వి సరిత మాట్లాడుతూ నూతన నేర చట్టాలలో మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల సత్వర న్యాయం కల్పించేలా ప్రాధాన్యం కల్పించారని చెప్పారు . ఇటువంటి వార్తలను విలేఖరులు ఎలా రాయాలనే అంశంపై పలు సూచనలు చేశారు.

మరో అతిధిగా పాల్గొన్న విజయవాడ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి కె.శివ హర్ష మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా వర్ణ చట్రాలతో కాలిగ్రఫీతో రూపొందించారన్నారు. అలాగే పాస్ పోర్టుల కోసం ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహిస్తున్నామని ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆకాశవాణి విజయవాడ డిప్యూటి డైరెక్టర్ జనరల్ ఎమ్. సోమేశ్వరరావు మాట్లాడుతూ ఆకాశవాణి సిబ్బందికి భారత రాజ్యాంగం అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.

ఈ సందర్బంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్ టెయిన్ మెంట్-వేవ్స్ 2025 సదస్సుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఆకాశవాణి కార్యక్రమ విభాగాధిపతి బి. వెంకటేశ్వర్లు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర, హిందీ అధికార భాష రిటైర్డ్ అధికారి ఎం సుబ్బా శేఖర్ , ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలో పనిచేసే 26 జిల్లాల పాత్రికేయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ నెల 18 నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు

-పాత సాంప్రదాయానికి తిరిగి అంకురం చేస్తున్న సీఎం చంద్రబాబు -గత ఐదేళ్ల పాలనలో ఇటువంటి కార్యక్రమాలు జరపలేదు -చీఫ్ విప్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *