గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరానికి ఐకానిక్ గా నిలిచేలా, ప్రస్తుతం వ్యాపారాలు చేస్తున్న వారికి ఏ విధమైన సమస్యలు లేకుండా పివికె నాయుడు మార్కెట్ ని అధునాతనంగా నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జిఎంసి అధికారులను ఆదేశించారు. ఆదివారం కేంద్ర మంత్రి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు పశ్చిమ శాసన సభ్యులు గల్లా మాధవి, అధికారులతో కలిసి పివికె నాయుడు మార్కెట్ ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అనంతరం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో మార్కెట్ వ్యాపారులు, సంఘాల ప్రతినిధులు, అధికారులతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పివికె నాయుడు మార్కెట్ నిర్మాణం ఏ విధానంలో జరిగినా అధునాతన వసతులు, జిఎంసిపై ఆర్ధిక భారం లేకుండా, ప్రస్తుతం అక్కడ ఉన్న వ్యాపారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. వ్యాపారులు మార్కెట్ నిర్మాణంపై అపోహలు నమ్మవద్దని, ప్రజా ప్రతినిధులు, జిఎంసి అధికారులు అందుబాటులోనే ఉంటారని, ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకుందామని తెలిపారు. మార్కెట్ నిర్మాణం పిపిపి విధానంలో చేయడం ద్వారా జిఎంసి పై ఆర్ధిక భారం పడదన్నారు. నగరంలో యుజిడి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 వందల కోట్లలో రూ.350 కోట్లు ఖర్చు చేసి, రూ.150 కోట్లు ఇతర రంగాలను మరలించారని, కనుక ఇక కేంద్రం యుజిడి కోసం నిధులు మంజూరు చేయదన్నారు. కనుక త్వరలో నగరంలో యూజీడి పనులు చేపట్టడానికి రుణాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మార్కెట్ నిర్మాణం అనంతరం తగిన ఆదాయం వచ్చేందుకు ఆయా ఫ్లోర్ లు అద్దె ప్రాతిపదికన ఇచ్చేలా ముందస్తుగానే ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్ లు, వ్యాపార సంస్థలతో ముందస్తు అగ్రిమెంట్ తీసుకుంటే మంచిదన్నారు. షుమారు 2ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్, పక్కనే ప్రస్తుతం ఉన్న జిఎంసి కార్యాలయం స్థానంలో నూతన భవనం నిర్మాణాలు చేయడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా చర్చించి, ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు.
సమావేశానికి తొలుత పివికె నాయుడు మార్కెట్ ని పరిశీలించి, వ్యాపారులతో మాట్లాడి, వారి అభిప్రాయలు, అనుమానాలు తెలుసుకొన్నారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రస్తుతం మార్కెట్ లో వ్యాపారస్తుల వివరాలు, ఇప్పటి వరకు రూపొందించిన డిజైన్ ని వివరించారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, టిడిపి ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంధ్ర, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, పివికె నాయుడు మార్కెట్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News