-డీ సీ పీ సరిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కవయిత్రి మొల్లమాంబ ను నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని ఆమె స్ఫూర్తిని భావితరాలకు అందించాలని డీ సీ పీ కే జీ వీ సరిత అన్నారు. మొల్లమాంబ 585వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్ రామ మందిరం వద్ద మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు గురువారం శంకుస్థాపన చేశారు. డీ సీ పీ కే జీ వీ సరిత, మాజి ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ, విజయవాడ శాలివాహన సంఘం అధ్యక్షులు భర్తవరపు దుర్గాప్రసాద్ లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పూజా కార్యక్రమం లో పాల్గొని మొల్లమాంబ విగ్రహానికి శంకుస్థాపన చేశారు.
విజయవాడ నగర శాలివాహన సంఘం (కుమ్మర) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీ సీ పీ సరిత ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ చదువు కొద్దిమందికి పరిమితమైన రోజుల్లో ఎంతో వివక్షతను ఎదుర్కొని సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేలా తెలుగులోకి అనువదించిన తొలి మహిళ కవయిత్రి మొల్లమాంబ ను నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సరళమైన భాషలో ఆమె రచించిన రామాయణం అందరికి ఆదర్శమని, సమాజ శ్రేయస్సు కోసం ఆమె ఎంతో పాటు పడ్డారని కొనియాడారు. మొల్లమాంబ స్ఫూర్తిని భావితరాలకు అందించడానికి ఆమె విగ్రహా ఏర్పాటుకు కృషి చేస్తున్న శాలివాహన సంఘం నాయకులను ఆమె అభినందించారు.
కార్యక్రమంలో శాలివాహన సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొమ్మిన శ్రీనివాస్, శాలివాహన సంఘం నాయకులు ఐలాపురం రాజా, ఐలాపురం చిన్నిబాబు, టిడిపి డివిజన్ అధ్యక్షులు రేగళ్ల లక్ష్మణ్, భాడిశ రూపేష్, శాలివాహన సంఘీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.