-కళాకారులందరికీ అంతర్జాతీయ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్
-ఏప్రిల్ 16న కందుకూరి వీరేశలింగం జయంతిని పురస్కరించుకొని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా తెలుగు నాటక రంగ దినోత్సవం
-కళాకారులకు ఊతమిచ్చే విధంగా కార్యక్రమాలు
-నాటకాన్ని సజీవంగా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ
-తెలుగు నాటకాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని పిలుపు
-నటుల ప్రతిభ తగ్గకుండా ఏఐ సాంకేతికతను నాటకంలో వినియోగించాల్సిన విధానం ఆలోచిస్తాం
-మరో 6 నెలల్లో రాష్ట్రానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తెస్తాం
-కళారంగానికి సేవ చేసే విషయంలో ఎల్లప్పుడూ ముందుంటాం
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో 27,28,29 తేదీల్లో విశాఖలో జరుగుతున్న లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలు -2025 లో ముఖ్య అతిథిగా పాల్గొని వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
విశాఖపట్టణం: నాటకాన్ని సజీవంగా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రపంచ రంగ స్థల దినోత్సవం సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.గురువారం సాయంత్రం విశాఖపట్నం మద్దిలపాలెం లో ఉన్న కళాభారతి ఏసి ఆడిటోరియంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో 27,28,29 తేదీల్లో జరుగుతున్న లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలు -2025 లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ తెలుగు నాటకాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలుగు నాటకం గొప్పతనాన్ని వివరించిన గొప్ప కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. తెలుగు నాటకం జాతీయ స్థాయిలో పరిఢవిల్లాలి అన్న మాటకు నాందిగా రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలు -2025 నిదర్శనమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు..
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏప్రిల్ 16వ తేదీన సంఘసంస్కర్త, రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగు నాటక రంగ దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం కళలను సజీవంగా నిలబెట్టాలన్న ఆలోచన చేస్తుందన్నారు. కళాకారులకు ఊతమిచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి వర్గ సహచరులు అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే జాతీయ స్థాయిలో తెలుగు నాటకం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఏపీలో ముందుగా ప్రభుత్వం తరపున నూటికినూరు శాతం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గతంలోనే మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ నాటి ప్రజాప్రతినిధులు ముందుకు తీసుకెళ్లలేదన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశానని, ఈ సందర్భంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు అవకాశం ఇవ్వమని కోరానన్నారు. దాని ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని చూపిస్తామన్నారు. రానున్న ఆరు నెలల కాలంలో రాష్ట్రానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను తీసుకొస్తామన్నారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి నిధులు కేటాయించమని అడిగానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ క్రమంలో నేడు రూ.97 కోట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
విభిన్న కళారూపాల్లో తెలుగువారిది అందెవేసిన చేయి అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అన్నారు.కళలను, కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరముందని మంత్రి దుర్గేష్ ఉద్ఘాటించారు. కొన్ని చోట్ల కొందరు సినిమా రంగంలో ఉన్నప్పటికీ కూడా నాటకాన్ని మర్చిపోలేదన్నారు. ఈ సందర్భంగా నాటకాన్ని కొనసాగిస్తోన్న కర్ణాటకకు చెందిన గిరీష్ ను ఉదహరించారు. తెలుగు సినిమా రంగానికి చెందిన కళాకారులను ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. ఒకప్పుడు రక్తకన్నీరు నాటకాన్ని స్వర్గీయ నాగభూషణం ప్రదర్శించారన్నారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే నాటక రంగంపై మక్కువ చూపుతూ అనేక నాటకాలను ప్రదర్శించేవారని గుర్తుచేశారు.కాలక్రమంలో నాటకానికి ప్రాధాన్యత తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాటకం అంటే చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. అమరావతి, విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతిలో గానీ నాటక రంగానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టి వృద్ధి చెందేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ముందుకు వెళ్తామన్నారు.
వేదికపై బారిష్టర్ పార్వతీశం నాటకాన్ని ప్రదర్శించిన కళాకారులను ఈ సందర్భంగా అభినందించారు.అలనాటి చిత్రాల్లో సాంకేతికతను వినియోగించిన తీరును వివరించారు.ఈ సందర్భంగా మోడరన్ థియేటర్ విధానంపై మంత్రి మాట్లాడారు. సీఎం చంద్రబాబు పదే పదే అంటున్నట్లు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ను నాటకానికి ఏ విధంగా వినియోగిస్తే బాగుంటుందో ఆలోచిస్తామన్నారు. హావభావాలు, ఆంగికం,వాచకం, అభినయం ఉంటూనే సహజత్వానికి తగ్గట్టుగా నటుల ప్రతిభ తగ్గకుండా అవసరమైన మేర సాంకేతికతను వినియోగించాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, రైటర్స్ అకాడమీ నిర్వాహకులు, సిబ్బంది, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, ప్రేక్షకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News