Breaking News

ఆప్కో కార్యాలయంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం…

-చేనేతకు ఒక బ్రాండ్ సృష్టించటమే మా ధ్యేయం : గౌతమ్ రెడ్డి
-స్వాతంత్రోద్యమ స్పూర్తిని రగిలించిన చేనేత : సజ్జల


-నేత కార్మికుల ఇక్కట్లకు గత పాలకుల పాపాలే కారణం : చిల్లపల్లి
-మంచి స్పందనతో ప్రారంభమైన ఉత్పత్తి ధరలకే అమ్మకాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలలో అంతర్భాగమని, మన వారసత్వ సంపదగా దీనిని కాపాడు కోవలపిన బాధ్యత మనందరిపైనా ఉందని రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఈ వ్యవస్ధను కాపాడుకునే క్రమంలో నైపుణ్యమున్న చేనేతల ద్వారా భావితరాలకు శిక్షణ అందిస్తామని తెలిపారు. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు అధ్యక్షతన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ చేనేత పారిశ్రామికుల సహకార సంఘం కార్యాలయం (ఆప్కో) అవరణలో శనివారం “జాతీయ చేనేత దినోత్సవ” వేడుకలకు ఘనంగా నిర్వహించారు. మేకపాటి ప్రసంగిస్తూ అభివృద్ధి అంటే పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు కాదని, గ్రామీణ స్థాయిలోనూ సకల సౌకర్యాలు కల్పించడమన్నదే నన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వచనమని ఆ క్రమంలోనే ప్రతి ఒక్క నేత కార్మికునికీ ఉపయోగపడేలా తమ ప్రభుత్వం విభిన్న పధకాలను అమలు చేస్తుందన్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి అంతర్జాతీయ సంస్ధల ద్వారా ఈ విక్రయాలు కల్పించి మార్కెటింగ్ సౌకర్యాలను పెంపొందిస్తామన్నారు. చేనేత వస్త్రాలకి ఒక బ్రాండ్ క్రియేట్ చేయటమే తమ ముందున్న ధ్యేయమన్నారు. గత ప్రభుత్వం చేనేత కార్మికులను అధోగతి పాలు చేసిందని, వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోలేదని విమర్సించారు. ఖాదీ, చేనేత, పొందూరు వస్త్ర పరిశ్రమల ద్వారా తయారైన వస్త్రాలను నవతరానికి చేరువ చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్టాడుతూ కళాత్మకతకు చేనేత వస్త్రం జీవం పోస్తుందని, పూజ్య బాపూజీ రాట్నం వడికి స్వదేశీ ఉద్యమానికి జీవం పోయటం ద్వారా బ్రిటీష్ వారిని తరిమి కొట్టారని గుర్తు చేసారు. భారతీయతకు నిదర్శనంగా విరాజిల్లుతున్న చేనేత వస్ర్తానికి ఆధునిక హంగులు జోడించి అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించటం ద్వారా దానిని భావితరాలకు అందించాలన్నారు. తన పాదయాత్రలో నేతన్నల పరిస్ధితులను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వారికి మేలు చేసేలా నేతన్న నేస్తం పేరిట రూ.24వేల అర్ధిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాలలో జమ చేసారన్నారు. చేనేత కార్మికులు భవిష్యత్తుపై బెంగ పెట్టుకోకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా యువతను ఆకర్షించేలా చేనేత వస్త్రాలను రూపొందించాలన్నారు. ఛైర్మన్ గా చిల్లపల్లి భాధ్యతలు స్వీకరించిన తరువాత ఆప్కో ఉన్నతి కనిపిస్తుందని, నూతన డిజైన్ల పట్టు లంగాలు, రెడిమేడ్ చొక్కాలు నూతనత్వాన్ని అందిపుచ్చుకున్నాయన్నారు.

ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహన రావు మాట్లాడుతూ చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ఆప్కో షోరూమ్ ల ద్వారా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఆప్కో షోరూమ్ లలో అమ్మ కాలు పెంచేందుకు చర్యలు తీసుకునే క్రమంలో షోరూమ్ ల సంఖ్యను పెంచుతున్నామని, కొత్త వెరైటీలు వినియోగదారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో మాదిరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్కో వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించాలని చిల్లపల్లి మంత్రికి విన్నవించారు. గత ప్రభుత్వం చేనేత కార్మికులను చిన్నచూపు చూసిందని, చేనేత వ్యవస్ధ నిర్వీర్యం అయ్యేందుకు కారణం నాటి పాలకులు మాత్రమేనని విమర్శించారు. ముఖ్యమంత్రి వారి కన్నీళ్లను తుడుస్తూ ఆసరాగా నిలుస్తుంటే చూడలేక ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. చేనేత కార్మికుల కోసం ఏ కార్యక్రమాన్ని అయినా చేపట్టేందుకు సిఎం సిద్దంగా ఉన్నారని చిల్లపల్లి పేర్కొన్నారు.

చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ చేనేతను పరిరక్షించుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా జీవన ప్రమాణ స్దాయిని పెంపొందించుకోవాలన్నారు. తొలుత కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన చేనేత మగ్గంను , నూతన డిజైన్ల చేనేత వస్త్రాలను నేతలు, అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సంచాలకులు పడాల అర్జున రావు, విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి , ఎంఎల్సి పోతుల సనీత, స్ధానిక ఎంఎల్ ఎ మల్లాది విష్ణు, ఆప్కో జిఎం రమేష్ బాబు, చేనేత జౌళి శాఖ సంయిక్త్త సంచాలకులు కన్నబాబు, నాగేశ్వరరావు, ఉపసంచాలకులు మురళి కృష్ణ, హరికృష్ణ, నాగరాజారావు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నుండి ఆప్కో విక్రయ శాలలో ఉత్పత్తి ధరలకే అమ్మకాలు చేస్తుండగా, వినియోగదారుల నుండి మంచి స్పందన కనిపిస్తోంది. కార్యక్రమంలో భాగంగా చేనేత రంగ ప్రతిభావంతులను సత్కరించారు. పలువురు చేనేత కార్మికులు మృతి చెందగా వారి కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *