విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్ధేశించి సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం! 74 ఏళ్ళు పూర్తయి 75వ ఏట అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి, మొత్తంగా 140 కోట్ల భారతీయులకు… నిండు మనసుతో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! ఒక దేశాన్ని మరో దేశం… ఒక జాతిని మరో జాతి… ఒక మనిషిని మరో మనిషి దోచుకోలేని వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆనాడు స్వాతంత్య్ర సమర యోధులు కలలుగన్నారు. స్వతంత్ర దేశంగా గడచిన 74 సంవత్సరాల్లో… భారతీయులుగా, భారత దేశంగా మనం ఏం సాధించాం అని… మన ప్రగతిని–మన వెనుకబాటును, జరిగిన మంచిని–చెడుని మన దేశం చర్చిస్తున్న సమయం ఇది. ఈ చర్చ జరగాలన్నారు.
–లోపాలను సరిదిద్దుకొనేందుకు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు, కొత్త బాటలు వేసుకునేందుకు మనందరికీ ఇది ఒక సందర్భం. ఈ రోజు ఢిల్లీ మొదలు మారుమూల పల్లె వరకు కూడా ఎగిరే ప్రతి జాతీయ జెండా ఘనమైన, పటిష్టమైన రేపటికి ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలి.
–74 ఏళ్ళ క్రితం, 1947 ఆగస్టు 15న కోరుకున్నది– మనను మనం పరిపాలించుకునే స్వాతంత్య్రం అయితే… ఇప్పుడు ప్రజలంతా, మన రాజ్యాంగం మనందరికీ ఇచ్చిన హక్కుల్ని, రక్షణల్ని, స్వాతంత్య్రాలను కచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నారు.
అంటే, మనల్ను మనమే పరిపాలించుకునే స్వాతంత్య్రంతోపాటు, మన రాజ్యాంగం ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు అందరికీ ఉన్నాయన్న హక్కులతోపాటు… ఆ హక్కులు అమలు అయ్యేందుకు కావాల్సిన పరిస్థితుల్ని, వాతావరణాన్ని, అవకాశాల్ని నెలకొల్పాలని కోరుకుంటున్నారు.
– హక్కులకు, మానవ హక్కులకు, స్వతంత్రానికి అర్థం, ఎప్పటికప్పుడు మరింతగా విస్తరిస్తూ మారుతూ ఉంటుంది. ఉదాహరణకు– ఇంటర్‌నెట్‌ను 2011లోనే ఐక్యరాజ్యసమితి కనీస మానవ హక్కుగా గుర్తించింది.
–మరోవంక, రైట్ టూ ఎడ్యుకేషన్ ఉన్నా… అంటే చదువుకునే హక్కును ఆర్టికల్ 21–ఎ ప్రకారం ప్రాథమిక హక్కుగా గుర్తించినా… ఒక పేద కుటుంబంలో ఒక పాపకు లేదా ఒక బాబుకు చదువుకునే పరిస్థితుల్ని కల్పించలేనంత కాలం ఆ హక్కు వల్ల ప్రయోజనం ఉండదు.
–హక్కుల ప్రకటనకు, హక్కుల అమలుకు మధ్య ఉన్న ఈ తేడాను తగ్గిస్తూ, ఈ తేడాను చెరిపేసేందుకు గత 26 నెలలుగా ప్రజల ప్రభుత్వంగా ప్రతి ఒక్కటీ చేశాం. ఈ రోజు ప్రతి ఒక్కరికీ కూడా అందితీరాల్సిన హక్కుల అమలుకు కావాల్సిన వాతావరణాన్ని కల్పించేందుకు మన 26 నెలల పాలనలో అనేక అడుగులు వేశాం.
–వివిధ వర్గాలు ఏం కోరుకుంటున్నాయన్నది నా 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశాను…వారు ఏం కోరుకుంటున్నారో నేను గమనించిన అంశాలను మరోసారి మీతో పంచుకుంటున్నాను….
–మన రైతులు తమ రెక్కలకు మరింత బలం కావాలని కోరుకున్నారు… అనేక కారణాల వల్ల ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబాటుకు గురైన మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలవారిలో… వారికీ మంచి భవిష్యత్తు ఉందన్న ఆత్మవిశ్వాసాన్ని నింపాలని కోరుకున్నారు. న్యాయబద్ధంగా వారికి దక్కవలసిన వాటా వారికి రావాలని కోరుకున్నారు.
–మన అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మరింత సాధికారిత ఇవ్వాలని కోరుకున్నారు. ఈ రోజు బడులకు, కాలేజీలకు వెళుతున్న పిల్లలు ప్రపంచంలో పోటీపడగలగాలని కోరుకున్నారు.
–రైట్ టూ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు… రైట్ టూ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కూడా ఉండాలని కోరుకున్నారు. ఎటువంటి వ్యాధికి అయినా వైద్యాన్ని ఒక హక్కుగా పేదలకు–దిగువ మధ్య తరగతికి ఇవ్వగలగాలని కోరుకున్నారు.
–పరిపాలన అంటే ఒకే నగరం కేంద్రంగా ఉంటుందన్న భావన పోయి…, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో… అందరికీ తమకు సమీపంలోనే పరిపాలన ఉందని, తెలియజేయాలని కోరుకున్నారు. ప్రతి కుటుంబమూ తమకంటూ ఒక సొంత ఇల్లు ఒక హక్కుగా లభించాలని కోరుకున్నారు.
–కులం,మతం,ప్రాంతం,వర్గం,రాజకీయం,పార్టీ… ఇవేమీ చూడకుండా మనిషిని మనిషిగా చూసే ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. అందరికీ సమన్యాయంతోపాటు లంచాలు లేని పారదర్శక వ్యవస్థ నెలకొనాలని ఆశపడ్డారు. కాబట్టే… ఇవన్నీ అందించటమే ఈ రోజున పరిపాలనకు, ప్రజాస్వామ్యానికి, స్వాతంత్య్రానికి అర్థం అని నమ్మాం కాబట్టే… కాబట్టే గత 26 నెలలుగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా గతిని మారుస్తూ నిర్ణయాలు తీసుకున్నాం. అనేక పథకాలు– అనేక కార్యక్రమాలు అమలు చేశాం.
ముందుగా రైతన్నలకోసం ఏం చేశాం అన్నది మీ ముందుంచుతున్నాను…
– 62 శాతం జనాభాకు ఆధారంగా వ్యవసాయం. ఈ వ్యవసాయాన్ని మొదటి ప్రాధాన్యంగా తీసుకుని అండగా నిలిచాం. ఈ 26 నెలల్లోనే వ్యవసాయం మీద దాదాపు రూ.83 వేల కోట్లు వ్యయం చేశామని సవినయంగా, సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తున్నాను.
–రాష్ట్రంలో 18.70 లక్షల రైతులకు పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇచ్చేందుకు ఇప్పటి వరకు దాదాపు రూ.18,000 కోట్ల మేరకు ఖర్చు చేశాం. నాణ్యమైన కరెంటు ఇచ్చేలా ఫీడర్ల మార్పు కోసం మనందరి ప్రభుత్వం వచ్చాక చేసిన ఖర్చు మరో రూ.1700 కోట్లు.
–ప్రతి రైతుకూ పెట్టుబడికి భరోసా ఇస్తూ, ఏటా రూ.13,500 వైయస్సార్ రైతు భరోసాగా అందిస్తున్నాం. రాష్ట్రంలోని 52.38 లక్షల రైతన్నలకు వైయస్సార్ రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 17 వేల కోట్లు అందించగలిగాం.
– విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతన్నకు తోడుండే రైతు భరోసా కేంద్రాలు మన గ్రామంలోనే మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి.
ఈ ఆర్బీకేల ఏర్పాటుతో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా వ్యవసాయ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాం.
–ఈ 26 నెలల కాలంలో, వైయస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు రూ. రూ.3788 కోట్లు అందించాం. వైయస్సార్ సున్నా వడ్డీ ద్వారా 67.50 లక్షల రైతులకు మరో రూ.1261 కోట్లు ఖర్చు చేసి రైతన్నలకు తోడుగా నిలబడ్డాం. రూ.2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని… రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం.
–ధాన్యం సేకరణ,కొనుగోళ్ళ కోసం ఇప్పటిదాకా ఈ 26 నెలల్లోనే రూ.33వేల కోట్ల చేశాం. పత్తికి మరో రూ.1800 కోట్లు, ఇతర పంటల కొనుగోళ్ళకు మరో రూ.6,434 కోట్లు వ్యయం చేశాం. ఏ ఒక్క రైతుకూ ఏ ఒక్క ఇబ్బందీ రాకూడదని తపించాం.
– గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిల్ని, గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ. 9000 కోట్ల ఉచిత విద్యుత్తు బకాయిల్ని, గత ప్రభుత్వం వదిలేసిన రూ.384 కోట్ల విత్తన బకాయిల భారాన్ని కూడా మన ప్రభుత్వమే చిరునవ్వుతో మోశాం అని ప్రతి రైతన్నకు తెలియజేస్తున్నాను.
–ఇవి కాకుండా… ఇన్‌పుట్ సబ్సిడీ.. ఏ సీజన్‌లో వచ్చే నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా కొత్త అర్ధం తెలియజేస్తూ ఇన్‌పుట్ సబ్సిడీని అదే సీజన్‌లో ఇచ్చే ప్రక్రియకు నాంది పలికి… 1039 కోట్ల చెల్లింపుల ద్వారా… పాడి రైతులకు దన్నుగా నిలుస్తూ ఏపీఅమూల్ పాలవెల్లువ ద్వారా… వైయస్సార్ జలకళ ద్వారా… ఆక్వా రైతుకు కరెంటు సబ్సిడీకి రెండేళ్లలో రూ.1500 కోట్లు ఇవ్వటం ద్వారా… శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో ముందడుగు వేయటం ద్వారా… నవరత్నాల పథకాలను పేద రైతు కుటుంబాలకు అందించటం ద్వారా… రైతు సాధికారితలో చరిత్రలో ఏ ప్రభుత్వం ఎన్నడూ వేయనన్ని ముందడుగులు వేశాం అని సవినయంగా, సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తున్నాను.
మన గ్రామంలో గానీ, మన నగరంలో, కేవలం ఈ 26 నెలల్లోనే ఏం మార్పులు వచ్చాయో… ఎలాంటి మార్పులు వచ్చాయో ఒక్కసారి గమనించండి…
ప్రతి 2000 మందికి మన పిల్లల్లో నుంచే 12 శాశ్వత ఉద్యోగాలతో, అక్షరాలా 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో కనిపిస్తున్నాయి. 500కు పైగా సేవలతో ఒక గ్రామ/వార్డు సచివాలయం ఏర్పాటు ద్వారా పౌర సేవల్లో దేశంలోనే సరికొత్త విప్లవానికి నాంది పలికాం.
– 1వ తేదీ సూర్యోదయానికి ముందే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు వారు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారి తలుపు తట్టి మరీ… ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా, 2.70 లక్షల మంది వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళే వ్యవస్థ కేవలం మనకే సొంతం.
– మన గ్రామమే తీసుకుంటే ప్రతి 2000 మందికి పౌర సేవలు అందించే గ్రామ సచివాలయం కనిపిస్తుంది.. అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని విధాలా సహాయం చేసే రైతు భరోసా కేంద్రాలు… అక్కడినుంచి మరో నాలుగు అడుగులు వేస్తే మన కళ్లెదుటనే చక,చకా కడుతున్న ∙వైయస్సార్ విలేజి క్లినిక్‌లు కనిపిస్తాయి. మరో నాలుగు అడుగులు వేస్తే పక్కనే ఇంగ్లీష్ మీడియం స్కూల్… అదే గ్రామంలో మరో నాలుగు అడుగుల దూరంలోనే కడుతూ ఉన్న డిజిటల్ గ్రంథాలయాలు, మరో నాలుగు అడుగుల దూరంలోనే ఇంగ్లీష్‌లో బోధించే ప్రీ ప్రైౖ మరీలు, ఫౌండేషన్ స్కూళ్ళు మన గ్రామంలోనే కనిపిస్తున్నాయి.
ప్రతి మండలానికీ ఒక అధునాతన 108, ప్రతి పీహెచ్‌సీకీ ఒక అధునాతన 104. ఇదీ కేవలం ఈ 26 నెలల పాలనలో మన ప్రభుత్వం మార్చిన, మార్చబోతున్న మన గ్రామం స్వరూపం.
విద్యార్ధుల కోసం…
– మన పిల్లల చదువుల కోసం ఏం చేశామో చూడండి… ఈ రోజు బడిలో ఉన్న ప్రతి పాప, ప్రతి బాబు… ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ, లేదా ప్రొఫెషనల్ విద్యను ఒక హక్కుగా చదువుకునే వాతావరణం కల్పించాం.
–ఈతరం, వచ్చేతరం పిల్లలు ప్రపంచంలో పోటీకి నిలబడి ఎదిగేందుకు అవసరమైన వాతావరణాన్ని విద్యారంగంలో నెలకొల్పుతున్నాం. అందులో భాగంగానే గవర్నమెంటు స్కూల్స్‌ను కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా తీర్చిదిద్దే విధంగా నాడు–నేడు ద్వారా రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ పాఠశాలలు, కాలేజీల రూపురేఖల్ని మారుస్తున్నాం. ఇందుకోసం ఇప్పటివరకు మొదటివిడతలో 15,715 స్కూళ్ళను నాడు–నేడు కింద మార్పు చేయడం కోసం చేసిన వ్యయం రూ.3,669 కోట్లు. రాబోయే రోజుల్లో మిగిలన స్కూళ్లు కూడా 2, 3 దశలలో ఇదే మార్పులు జరుగుతాయి.
–జగనన్న విద్యా కానుక ద్వారా గవర్నమెంటు స్కూళ్ళలో పిల్లలకు కుట్టుకూలితో సహా మూడు జతల యూనిఫాంలు, స్కూల్ బ్యాగ్. బైలింగ్యువల్ టెక్స్‌ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్టు, షూస్, సాక్సులు… వీటితోపాటు ఒక డిక్షనరీ… ఇవన్నీ ఉచితంగా అందిస్తున్నాం. 47 లక్షల మంది పిల్లలకు మేలు చేస్తూ ఇందుకోసం ఇప్పటివరకు రూ. 1300 కోట్లు ఖర్చు చేశాం.
–మన పిల్లల కోసం మార్చిన మెనూ ద్వారా పిల్లలకు వారంలో ప్రతి రోజూ వేర్వేరు ఆహార పదార్థాలతో… అన్నం, పప్పుచారు, ఆకుకూర పప్పు, చిక్కీ, ఎగ్‌కర్రీ, పులిహోర, టొమేటో పప్పు, ఉడికించిన గుడ్డు, కూరగాయల అన్నం, కిచిడీ, చట్నీ వంటి రకరకాల ఆహార పదార్థాలతో… రోజుకు ఒక మెనూతో… జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నాం. 36.89 లక్షల పిల్లలకు మేలు చేస్తూ ఇందుకోసం ప్రతిఏటా రూ. 1600 కోట్లు చిరునవ్వుతోనే ఖర్చు చేస్తున్నాం.
– గర్భిణులు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలు… వీరందరికీ కూడా ఐరన్ కంటెంట్ లేక ఎనీమియాతో బాధపడుతున్న పరిస్థితులను చూసి, వీరందరికీ పౌష్టికాహారాన్ని అందించే సంపూర్ణ పోషణ పథకం ద్వారా 30.16 లక్షలమందికి మేలు చేస్తూ ఏటా రూ. 1800 కోట్లు వ్యయం చేస్తున్నాం.
జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా, రాబోయే తరం అవసరాలను దృష్టిలో ఉంచుకుని బడుల్లో మార్పులు చేస్తున్నాం. తద్వారా ప్రతి విద్యార్థికి వివిధ సబ్జెక్టులను బోధించే టీచర్ల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నాం. రాబోయే రోజుల్లో మన బడుల్లో వివిధ సబ్జెక్టులకు వివిధ స్పెషలిస్ట్ టీచర్లు బోధించబోయే పరిస్థితి రాబోతోంది.
–ప్రభుత్వ స్కూళ్ళను సీబీఎస్‌ఈ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా మారుస్తున్నాం. ఫీజుల నియంత్రణతోపాటు, విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ దోపిడీకి నియంత్రణ కమిషన్ల ఏర్పాటు ద్వారా అడ్డుకట్ట వేస్తున్నాం. కేజీ నుంచి డిగ్రీ వరకు విద్యా సాధికారితను ప్రతి ఒక్కరూ హక్కుగా పొందగలిగేలా ఇవన్నీ చేశాం.
–పెద్ద చదువులు చదివే పిల్లల కోసం జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తిగా 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపు చేస్తున్నాం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఎటువంటి బకాయిలు కాలేజీలకు లేకుండా, తల్లుల ఖాతాలకే ఈ సొమ్మును జమ చేస్తున్నాం. ఆ తల్లులే కాలేజీలకు వెళ్లి,
తమ పిల్లల బాగోగులు, కాలేజీల బాగోగులు కనుక్కుని ఫీజులూ వాళ్లే కట్టేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇందుకోసం ఇప్పటిదాకా రూ. రూ.5,573 కోట్లు ఖర్చు చేశాం.
–విద్యార్థుల కోసం వారు కష్టపడకూడదని, బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులకోసం జగనన్న వసతి దీవెన అమలు చేస్తున్నాం. 15.57 లక్షల విద్యార్థులకు మేలు చేస్తూ ఇప్పటివరకు రూ.2270 కోట్లు ఖర్చు చేశాం. పిల్లల చదువుల కోసం ఇప్పటివరకు కేవలం పైన చెప్పి ఈ పథకాలకే దాదాపుగా రూ.26,677 కోట్లు ఖర్చు చేశాం.
మహిళల కోసం…
–మనది మహిళా పక్షపాత ప్రభుత్వం… 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలన్న లక్ష్యంతో, 44.50 లక్షల తల్లులకు మంచి జరగాలని 85 లక్షల పిల్లలకు మంచి జరగాలని ఏటా జగనన్న అమ్మ ఒడిద్వారా 6500 కోట్లు చొప్పున, రెండేళ్ళలో ఇప్పటికే రూ.13 వేల కోట్లు అందజేశాం.
– ఈ చర్యలన్నీ తీసుకున్న ఫలితంగా, 1 నుంచి 10 వరకు చదివే పిల్లల సంఖ్య 2018–19తో పోలిస్తే… ప్రై వేట్, గవర్నమెంట్ స్కూళ్ళ మొత్తం ఎన్‌రోల్‌మెంట్ కలిపి 2018–19లో 70.43 లక్షల నుంచి ఇవాళ 73.05 లక్షలకు కోవిడ్ సమయంలో కూడా పెరిగింది. కేవలం ప్రభుత్వ బడుల్నే తీసుకుంటే 2018–19 కాలంలోనే ఎన్‌రోల్‌మెంట్… 37.20 లక్షల నుంచి ఇవాళ 43.43 లక్షలకు పెరిగింది. మనం తీసుకున్న విప్లవాత్మక చర్యల వల్ల ప్రతి తల్లిలోనూ, ప్రతి బిడ్డలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది.
–వైయస్సార్ ఆసరా ద్వారా 8.71 లక్షల డ్వాక్రా బృందాల్లో ఉన్న 87.75 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే కలిగిన లబ్ధి రూ.6,500 కోట్లు. వైయస్సార్ చేయూత ద్వారా 24.56 లక్షల మంది 45 నుంచి 60 యేళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రెండు విడతలుగా అందించిన లబ్ధి రూ.9,000 కోట్లు. ఈ సొమ్ముకు బ్యాంకుల ద్వారా మరింత రుణ సదుపాయంతో పాటు, అమూల్, ఐటీసీ, రిలయన్స్ వంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థలతో టై–అప్ కూడా చేసి, అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు మరింతగా చేయూత ఇస్తున్నాం.
–వైయస్సార్–జగనన్న కాలనీల ద్వారా… అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చాం, గృహ నిర్మాణం ద్వారా దాదాపు 1.25 కోట్ల మందికి… అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి లబ్ధి చేకూరుతోంది. ఇప్పటికే ఇళ్ల స్థలాలు చేతికి అందించటమే కాకుండా, మొదటి దశలో 15.60 లక్షల ఇంటి నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి.
–ఈ ఇల్లు పూర్తి అయిన తరవాత ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.5 నుంచి 10 లక్షలు ఉంటుందనుకుంటే… ఈ 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో అక్షరాలా దాదాపుగా రూ. 2 లక్షల నుంచి – రూ.3 లక్షల కోట్ల సంపదను ఉంచుతున్నాం.
–వైయస్సార్ సున్నా వడ్డీ ద్వారా 1కోటీ 2లక్షల అక్కచెల్లెమ్మలకు రూ. 2,509 కోట్లు అందించాం. అలాగే… వైయస్సార్ కాపు నేస్తం ద్వారా ఇప్పటివరకు 3.28 లక్షల అక్కచెల్లెమ్మలకు రూ.982 కోట్లు లబ్ధి చేకూర్చాం. ఇవి కాకుండా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా జరిగిన మేలును ఇంతకు ముందే వివరించా.
–దేశ చరిత్రలోనే తొలిసారిగా, నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్‌లో ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం కచ్చితంగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చే విధంగా ఏకంగా చట్టాన్నే తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. దీనివల్ల ఈ రోజు వివిధ నామినేటెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ల పదవుల్లో, మున్సిపల్–కార్పొరేషన్ ఛైర్మన్ల పదవుల్లో 50 శాతం మహిళలే కనిపిస్తున్నారు. అక్కచెల్లెమ్మల భద్రతకు ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇచ్చింది. ఆ అక్కచెల్లెమ్మల కోసం ఒక చెల్లిని హోంమంత్రిగా తీసుకురావడమే కాకుండా, దిశ బిల్లు– దిశ పోలీస్ స్టేషన్లు–దిశ పబ్లిక్ ప్రాసెక్యూటర్లు, దిశ యాప్‌లకు రూపకల్పన చేసిన ప్రభుత్వం మనది.
– కుటుంబాల్లో సంతోషం నింపేలా మద్య నియంత్రణ దిశగా అడుగులు వేసిన ప్రభుత్వం కూడా మనదే.
ఆరోగ్య రంగం…
–ఇక, మన వైద్యం–ఆరోగ్య రంగంలో జరిగిన మార్పులును కూడా గమనించమని కోరుతున్నాను. వార్షిక ఆదాయం 5 లక్షలలోపు ఉన్నవారందరికీ వైయస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపజేయటం ద్వారా 95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం.
–రూ.1000 ఖర్చు దాటితే ఉచితంగా వైద్యం అందించాలన్న తపనతోనే 2434 ప్రొసీజర్లను ఇప్పటికే ఆరోగ్యశ్రీలో చేర్చాం. ఆపరేషన్ తరవాత రోగి కోలుకునే సమయంలో వారికి దన్నుగా నెలకు రూ.5000 వైయస్సార్ ఆరోగ్య ఆసరాగా ఇస్తున్నాం.
–ఈ 26 నెలల కాలంలో వైయస్సార్ ఆరోగ్యశ్రీమీద రూ. 3900 కోట్లు వ్యయం చేశాం. ఎమర్జెన్సీలో ప్రాణాలు రక్షించే 108, 104 సేవలకు అర్థం చెపుతూ ఏకంగా 1068 వాహనాల్ని ప్రతి నియోజకవర్గానికీ పంపాం. పిల్లలూ, పెద్దలందరికీ వర్తించేలా వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది.
–ఇవి కాకుండా, గ్రామ గ్రామాన కూడా వైయస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు అవుతున్నాయి. కోవిడ్‌పై యుద్ధంలో ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తూ ఫోకస్డ్ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ ద్వారా, మన దగ్గర టయర్ వన్ సిటీలు లేకున్నా కూడా, ఆధునిక ౖÐð ద్యం తక్కువగా ఉన్నా కూడా
పేదలకు ఉచితంగా ఆరోగ్యశ్రీలో కోవిడ్‌కు వైద్యం అందిస్తూ పేదలకు అండగా, అటు పరీక్షల్లోనూ, ఇటు ట్రీట్‌మెంటులోనూ అగ్రగామి రాష్ట్రంగా ముందడుగు వేశాం.
–రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 11 టీచింగ్ ఆసుపత్రులు ఉంటే, కొత్తగా మరో 16 వైద్య బోధనాసుపత్రులను నిర్మాణం చేస్తున్నాం. గ్రామం నుంచి జిల్లా వరకు ఆసుపత్రుల రూపాన్ని, సేవల్ని, సదుపాయాల్ని మార్చేస్తూ జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందించటానికి వైద్య రంగంలో నాడు–నేడు అమలు చేస్తున్నాం. ఇందుకోసం రూ. 16,300 కోట్లు వ్యయం చేస్తున్నాం.
–కోవిడ్ వల్ల తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు రూ. 10 లక్షలు డిపాజిట్ చేసి… వారి ఆలనా పాలనా చూసుకునే ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం కూడా దేశంలో మనదే. మనది… మనిషిని బతికించాలనే ప్రతి ఒక్క ప్రయత్నాన్నీ మనసు పెట్టి చేసే ప్రభుత్వం.
సామాజిక న్యాయానికి అర్థం చెపుతూ 26 నెలలుగా పాలన సాగిస్తున్నాం.
–దేశ చరిత్రలోనే రికార్డుగా పేదలకు 31 లక్షల ఇళ్ళ పట్టాలు అందజేసి–రెండు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. ఇందులో మొదటి దశ నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
–వైయస్సార్ కాపు నేస్తం, వైయస్సార్ మత్య్సకార భరోసా, వైయస్సార్ నేతన్న నేస్తం, వైయస్సార్ వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా నిరు పేదలకు అండగా నిలుస్తున్నాం. అగ్రీ గోల్డ్ బాధితులకు బాసటగా రెండో విడత డబ్బును కూడా ఈ నెలలోనే అందించబోతున్నాం.
– ఈ 26 నెలల కాలంలోనే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చిన పెన్షన్లనే తీసుకుంటే… 2019 ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 39 లక్షల పెన్షన్లు ఉంటే, మన ప్రభుత్వంలో 61 లక్షల పెన్షన్లకు పెంచి ఇస్తున్నాం. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.1000 ఇచ్చిన పెన్షన్ సొమ్మును రూ.2,250కి పెంచినది మన ప్రభుత్వమే. అలాగే, గత ప్రభుత్వ హయాంలో నెలకు రూ. 500 కోట్లుగా ఉన్న పెన్షన్ బిల్లు… నేడు రూ. 1500 కోట్లకు చేరింది.
–రాజ్యాంగం పీఠికలో రాసిన సోదరభావానికి (ఫ్రెటర్నిటీకి) అర్థం చెపుతూ… సామాజిక న్యాయాన్ని అమలు చేసి చూపాం. మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి 60 శాతం పదవులు ఇచ్చినదీ మనమే. 5 ఉపముఖ్యమంత్రుల పదవుల్లో 4 ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు ఇచ్చిన ప్రభుత్వం మనదే.
అటు రాజ్యసభలో మనమిచ్చిన సీట్లను తీసుకున్నా… ఇటు కౌన్సిల్‌లో మనం పంపిన సీట్లు తీసుకున్నా కూడా సామాజిక న్యాయం మనం చేసినట్లుగా ఇంతకముందు జరగలేదు. నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ కాంట్రాక్టుల్లోనూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు ఏకంగా చట్టం చేసి 50 శాతం వచ్చేట్టుగా చేశాం. నామినేటెడ్ పదవులలో, నామినేటెడ్ కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం వచ్చేట్టుగా చట్టం చేసి ఇచ్చాం.
నిరుద్యోగుల కోసం…
–ఉద్యోగాల విషయానికి వస్తే… సగర్వంగా తెలియజేస్తున్నాను! ఈ 26 నెలల్లోనే అక్షరాలా 1.86 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మన కళ్ళ ఎదుటే దాదాపు 1.30 లక్షల శాశ్వత ఉద్యోగులు గ్రామ/వార్డు సచివాలయాల్లో కనిపిస్తున్నారు. ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీలో 58 వేల మంది ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తున్నారు. 2.70 లక్షల మంది మన కళ్ళ ఎదుటే, ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లుగా కనిపిస్తున్నారు. 95 వేలకు పైగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా న్యాయం చేశాం. మరో 20 వేల మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలిచ్చాం. ఇలా అక్షరాలా ఈ 26 నెలల్లోనే 6.03 లక్షల మంది మన కళ్ళెదుట కనిపిస్తున్నారు. సామాజిక న్యాయానికి అద్దం పడుతూ ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు కనీసం 75 శాతానికి పైగా ఉద్యోగాలు లభించాయని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను.
అంతే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగరపంచాయతీ ఛైర్మన్లలో కూడా సగం భాగం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇచ్చాం. నెల రోజుల క్రితం ప్రకటించన నామినేటెడ్ పదవుల్లో కూడా సగభాగానికి మించి 58 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వడంతో పాటు సగం పదవులు మహిళలకు ఇచ్చామని సవినయంగా తెలియజేస్తున్నాను.
–శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేయటంతోపాటు… ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల దిశగా అడుగులు వేశాం. ఎస్సీల్లో మాల, మాదిగ, రెల్లి… మూడు కార్పొరేషన్లు ఏర్పాటు. బీసీలకు ప్రత్యేకించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మార్కెట్ యార్డుల ఛైర్మన్లు, దేవస్థానాల కమిటీల ఛైర్మన్లుగా, సభ్యులుగా ఈ రోజు పేద సామాజిక వర్గాలవారు సగభాగం కనిపిస్తున్నారని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను.
ఇక ఉద్యోగుల జీతాల విషయంలో…
– గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా, అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రభుత్వోద్యోగులకు 27 శాతం ఐ ఆర్ ఇచ్చాం. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చాం.
– అంగన్‌వాడీల్లో పని చేస్తున్నవారికి, ఆశా వర్కర్లకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, శానిటరీ వర్కర్లకు, హోం గార్డులకు, 104, 108 సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు… ఇలా అనేక విభాగాల్లో పనిచేస్తూ చాలీ, చాలని వేతనాలతో బతుకుబండి ఈడుస్తున్న 7,02,656 మందికి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధి చేకూర్చేలా వేతనాలు పెంచాం. కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్లకి మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే టైం స్కేల్ అమలు చేశాం.
పోలీసులుకు వీక్లీ ఆఫ్ కూడా మనం వచ్చాకే తీసుకొచ్చాం.
– ఉద్యోగులకు చేయాల్సినవి మరి కొన్ని ఉన్నాయన్నది నాకు తెలుసు. వారందరికీ న్యాయం చేసేలా రాబోయే రోజుల్లో మరి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం.
గత ఒకటిన్నర సంవత్సరంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాం. మానవాళి చరిత్రలోనే అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాం. కనిపించని శత్రువు చేస్తున్న దాడిని ఎదుర్కొనే విషయంలో పూర్తి సైన్యంతో మొత్తం శక్తినంతా కూడదీసుకుని ఎదురించాం.
–కోవిడ్ దాడివల్ల ప్రభుత్వానికి కష్టాలు వచ్చాయి… గత 16 నెలల కాలాన్నే తీసుకుంటే రెవెన్యూ మనం ఆశించిన రీతిలో రాలేదు. వ్యయం మాత్రం మనం అనుకోని విధంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితి ఒక కుటుంబానికే వస్తే ఆ కుటుంబం ఎంతగా తల్లడిల్లుతుందో అర్థం చేసుకుని… ఆ పరిస్థితి ఏ కుటుంబానికీ రాకూడదని ప్రభుత్వంగా తపించాం. అవినీతికి, వివక్షకు తావు లేని విధంగా ప్రతి ఒక్క రూపాయీ ప్రజలకే నేరుగా ఇచ్చాం.
–ప్రతి ఒక్క కుటుంబం నిన్నటికంటే నేడు… నేటి కంటే రేపు… ప్రతి ఒక్క సామాజికవర్గం నిన్నటి కంటే నేడు… నేటి కంటే రేపు… ప్రతి ఒక్క ప్రాంతం… నిన్నటి కంటే నేడు… నేటి కంటే రేపు బాగుండేలా మన ప్రభుత్వం ప్రతి రూపాయినీ బాధ్యతగా ఖర్చు చేస్తోంది.
–భవిష్యత్తును ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ప్రభుత్వం మీది. మీరిచ్చిన అధికారంతో నేను సేవకుడిగా మాత్రమే ఇక్కడ ఉన్నాను. 74 ఏళ్ల తరవాత కూడా… ఈ రోజుకూ కనిపిస్తున్న వ్యవస్థాగత లోపాలను సరిదిద్దేందుకే ఇక్కడ ఉన్నాను.
– స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, సమానత్వానికి ఆచరణణలో అర్థం చెపుతూ మన రాష్ట్రం ముందడుగువేస్తోందని; సగర్వంగా చెపుతూ… దేవుడి దీవెనలు; ప్రజలందరి చల్లని ఆశీస్సులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికీ… వారందరితోపాటు మనందరి ప్రభుత్వానికి లభించాలని నిండు మనసుతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ బాలసుబ్రమణ్యం, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు మేకతోటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి వైయస్.భారతీ రెడ్డి కూడా హాజరయ్యారు.