-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్
-నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు
-ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు వైద్యం అందించడం సంతోషమన్న మంత్రి దుర్గేష్
-ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 200 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థను అభినందించిన మంత్రి దుర్గేష్
-పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించినందుకు ప్రభుత్వానికి, మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపిన చర్చిపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలును ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలోని చర్చిపేటలో మంత్రి దుర్గేష్ పర్యటించారు. బీసీ కమ్యూనిటీ హాల్ నందు హ్యాండ్ ఆఫ్ హోప్ సహకారంతో బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్, హోప్ ఫర్ చిల్డ్రన్ సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మెడికల్ క్యాంపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 200 మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థకు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో వైద్య సదుపాయాలు అందిస్తున్నప్పటికీ ప్రైవేట్ సంస్థల నుండి ఈ తరహా ప్రోత్సాహం ఉంటే ప్రజలకు మరిన్ని సేవలు అందిచ్చవచ్చన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ తరహా ఉచిత వైద్య శిబిరాలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. ప్రధానంగా మెడికల్ క్యాంపులో ఈసీజీ పరీక్షలు, రక్త, మూత్ర, షుగర్,బీపీ తదితర ల్యాబ్ టెస్టులు, గుండె సంబంధిత వ్యాధులు, డెంటల్, ఆప్తమాలజీ, సీజనల్ వ్యాధులకు సంబంధించిన తదితర పరీక్షలు చేసి మందులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సుశిక్షుతులైన వైద్యులచేత పరీక్షలు చేయించి రుగ్మతలు గుర్తించి అవసరమైన మందులను అందించడమే గాక వ్యాధులపై అవగాహన కల్పించి వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం శుభ పరిణామమన్నారు. ప్రజలందరూ ఈ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిడదవోలులో వైద్య శిబిరం నిర్వహించినందుకు సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్నసంస్థ సభ్యులు జువ్వల రాంబాబు, ప్రసన్నలను మంత్రి దుర్గేష్ ప్రత్యేక అభినందించారు.
నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇప్పటికే ఈ విషయమై సీఎం చంద్రబాబునాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబులతో మాట్లాడానన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మార్చాలంటే ఆస్పత్రిలో మౌలికసదుపాయాలతో పాటు భారీగా వైద్య సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఉంటుందని, వారికి వేతనాలు అందించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఆర్థిక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.వాటన్నింటిని మంజూరు చేయించుకొని పరిపూర్ణంగా అతిత్వరలోనే 100 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తామన్నారు.
మంత్రి కందుల దుర్గేష్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయులు కృతజ్ఞతలు
అనంతరం చర్చిపేటలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు.ఉపాధ్యాయులను అడిగి విద్యార్థుల ప్రగతిని తెలుసుకున్నారు.పిల్లలు భవిష్యత్తు బాగుండేందుకు తనదైన శైలిలో సలహాలు సూచనలిచ్చారు.మధ్యాహ్న భోజన వివరాలను చిన్నారులతో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నచ్చిందా అన్న ప్రశ్నకు రుచిగా ఉందని విద్యార్థులు మంత్రితో సమాధానం చెప్పారు. అదే విధంగా యూనిఫామ్ ల గురించి ఆరా తీశారు. మంచి యూనిఫామ్స్ అందించారని చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించినందుకు ప్రభుత్వానికి, మంత్రి దుర్గేష్ కు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. తద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మధ్య సత్సబంధాలు మెరుగుపడటమే గాక విద్యార్థుల భవిష్యత్తుకు ప్రోత్సాహం అందించినట్లవుతుందని వారు మంత్రి కందుల దుర్గేష్ తో అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు పట్టణ అధ్యక్షుడు రంగారమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ప్రమోద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News