-పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలి
-పరిసరాల పరిశుభ్రత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి
-అగిరిపల్లి మండలం శోభనాపురం శివారు బొద్దన్నపల్లి లో వీధులను శుభ్రం చేసి, డ్రైన్లలో పూడిక తీసిన రాష్ట్ర గృహ నిర్మాణ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
ఏలూరు/అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు తగ్గాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా అగిరిపల్లి మండలం శోభనాపురం శివారు బొద్దానపల్లి పంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో వీధులను శుభ్రం చేసి, డ్రైన్లలో పూడికను తొలగించారు. అనంతరం జిల్లాపరిషత్ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారధి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ వ్యాధులకు మూలం అపరిశుభ్ర వాతావరణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా 25 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజారోగ్య పరిరక్షణకు ఖర్చు చేస్తున్నదన్నారు. వ్యాధుల మూలంగా ప్రజలు ఆర్థికంగా నష్టపొవడమే కాక, శారీరకంగా కూడా బలహీనులవుతారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధులు వచ్చిన తరవాత చికిత్స కన్నా వ్యాధులు రాకుండా నివారణకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే లు అందరూ స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ్ దివస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలలో పరిశుభ్రతపై చైతన్యం తీసుకువస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు ప్రతీ నెలలో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా గత జనవరి నెల నుండి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ చేపడుతున్నారని, మార్పు ఎప్పుడూ ఒక్క రోజుతో రాదని, ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంతో రాష్ట్రంలో ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు గతంలో తక్కువగా నమోదయ్యాయని, ఇది ఒక మంచి శుభ పరిరణమన్నారు. పరిసరాల అపరిశుభ్రంగా, డ్రైనేజీలలో మురుగునీరు నిల్వ కారణంగా దోమలు వ్యాప్తిచెంది మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగంగా కావాలని, ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించినప్పుడే వ్యాధులు మన దరిచేరవని, అనారోగ్యానికి గురికానివారి జీవిత కాలం పెరుగుతుందన్నారు. వ్యక్తిగత, పరిసర పరిశుభ్రల గురించి కరోనా మనకు ఒక గుణపాఠం నేర్పిందన్నారు. పెన్షన్లకు ఏటా 34 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందించడం ప్రభుత్వ ఉద్దేశ్యమని, అదే సమయంలో దొంగ సర్టిఫికెట్లతొ పెన్షన్ లబ్దిని పొందే అనర్హులను తొలగించడం కూడా ఆవశ్యకమన్నారు. రాష్ట్రంలో . 65 లక్షల మంది విభిన్న ప్రతిభావంతులకు పెన్షన్లు అందిస్తున్నామని, సంబంధించి కొంతమంది దొంగ సర్టిఫికెట్లతో పొందుతున్నారని, వారిని గుర్తించేందుకు పరిశీలన కార్యక్రమం చేపట్టామన్నారు. రెండవసారి పరిశీలనకు ఇప్పటివరకు 5. 10 లక్షల మందికి నోటీసులు జారీ చేయగా 4. 75 లక్షల మంది పరిశీలనకు హజారయ్యారని, మిగిలినవారు ఎన్నిసార్లు నోటీసీలు ఇచిన్నప్పటికీ హాజరుకావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తున్నదని, గతంలో ఎన్నడూ లేనివిధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంతో పోల్చితే తమ ప్రభుత్వం సంక్షేమానికి అధిక మొత్తం ఖర్చు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు మీద నమ్మకంతో ఎంతో మంది పెట్టుబడిదారులు రాష్ట్రంలో లక్షల కోట్లతో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారన్నారు. వీటి ద్వారా రాష్ట్ర అభివృద్ధి పధంలో నిలవడమేకాక, రాష్ట్రంలోని యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తమ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఈ విధమైన అభివృద్ధి జరిగిపోతే సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయవచ్చన్నారు. రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్న క్వాంటం వాలీ ద్వారా రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు కల్పన జరుగుతున్నదన్నారు
నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతీ నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. పాఠశాలల్లోని విద్యార్థులను వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ వినియోగం కారణంగా కలిగే దుష్పరిణామాలను తెలియజేస్తున్నామన్నారు.
అనంతరం బొద్దన్నపల్లి లోని పారిశుద్ధ్య కార్మికులు సీతారాంబాబు, పేరంటమ్మ లను మంత్రి దుశ్శాలువా, పూలమాలతో సన్మానించి, తన స్వంత నగదు 7 వేల రూపాయలను బహుమతిగా అందించారు. వాటితో పాటు పండ్లను అందించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు చేతుల పరిశుభ్రత విధానంను ప్రదర్శించారు.
ముందుకు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రమాద భీమా సొమ్మును మంత్రి అందించారు.
అనంతరం సభికులతో పారిశుద్ధ్య ప్రతిజ్ఞను మంత్రి చేయించారు.
కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంపిడిఓ భార్గవి, పాఠశాల ప్రధానోపాద్యాయురాలు యామిని కృష్ణప్రియ, స్థానిక ప్రముఖులు వేణు, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News