Breaking News

ఘనంగా ప్రారంభమైన సిపిఐ రాష్ట్ర మహాసభలు

– అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్సీ పి జే చంద్రశేఖర్
– ఆహ్వాన సంఘం ఉపన్యాసం అందించిన అన్న నల్లూరి
– మహాసభలను ప్రారంభించిన సిపిఐ కేంద్ర సమితి సభ్యురాలు కామ్రేడ్ వహీదా పర్వీన్
– సోహర్ద సందేశం అందించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
– ఉర్రూతలూగించిన ఏపీ ప్రజానాట్యమండలి కళాకారులు కళారూపాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలు ఎస్ జి వి ఎస్ కళ్యాణ మండపం ఆవరణంలో ఏర్పాటు చేసిన కామ్రేడ్ నల్లూరి అంజయ్య ప్రాంగణంలో కామ్రేడ్ పూల సుబ్బయ్య సభ వేదికపై ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అధ్యక్షవర్గం గా జెవివి సత్యనారాయణమూర్తి, దుర్గ భవాని, కృష్ణ చైతన్య, జాఫర్, ఎం ఎల్ నారాయణ, సత్యనారాయణ, నాజర్ జి వ్యవహరించారు. మృత వీరుల స్థూపాన్ని మాజీ ఎమ్మెల్సీ పి జె చంద్రశేఖర్ ఆవిష్కరించి, మృత వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృత వీరులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తో పాటుగా రాష్ట్ర, జాతీయ, జిల్లా సముతుల నాయకులతోపాటు మహాసభ ప్రతినిధులు మృత వీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన మృత వీరులారా లాల్ సలాం పాట మృత వీరుల త్యాగాలను గుర్తు చేశాయి.అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ను సిపిఐ జాతీయ సమితి నాయకులు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య ప్రారంభించారు. అనంతరం సభాస్థలిలో సంతాప తీర్మానాన్ని పి జగదీష్ ప్రవేశపెట్టగా మహాసభలలోని ప్రతి ఒక్కరు లేచి నిలబడి అమరవీరులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుని పలుకులుగా నల్లూరి వెంకటేశ్వర్లు( అన్న) మాట్లాడుతూ 100 సంవత్సరాల సిపిఐ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర మహాసభలు ఒంగోలులో నిర్వహించేందుకు అవకాశం కల్పించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కాకలు తీరిన పార్టీ నాయకులు చైతన్యంతో ఉత్సాహంతో ఉరకలేసే యువతరం కార్యకర్తలు ఒంగోలు నగరానికి రావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. మూడు వెనుకబడిన ప్రాంతాలను తీసుకొని అభివృద్ధి లక్ష్యంగా 1970లో స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో ప్రకాశం జిల్లా ఏర్పడిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మార్కాపురం పలకలు, చీమకుర్తి గ్రానైట్, ఒంగోలు గిత్త జిల్లా ప్రత్యేకతలు అన్ని పేర్కొన్నారు. అయితే అనుకున్న స్థాయిలో జిల్లా అభివృద్ధి జరగలేదని, ఇప్పటికీ ఉపాధి కోసం జిల్లా ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోవటం పరిపాటిగా మారిందన్నారు. జిల్లాలో ప్రధాన సమస్య సాగు తాగు నీరు అన్నారు. దీనిని అధిగమించటానికి కామ్రేడ్ పూల సుబ్బయ్య పోరాట ఫలితంగా వెలుగొండ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారన్నారు. పూల సుబ్బయ్య గారి పోరాట పటిమను గుర్తుచేస్తూ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు కామ్రేడ్ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా నామకరణం చేశారన్నారు. 29 సంవత్సరాలుగా ప్రాజెక్టు పనులు నత్త నడక సాగుతున్నాయన్నారు. ప్రకాశం జిల్లా పోరాటాల గడ్డ అన్నారు. ఒంగోలు ప్రాంతంలో అమరవీధులు మాదాల నారాయణస్వామి, నల్లూరి అంజయ్య, సివి రాఘవయ్య ప్రసిద్ధులు అన్నారు. పార్టీ నిషేధిత సమయంలో కామ్రేడ్ నారాయణస్వామి ఆచూకీ చెప్పాలంటూ ఆయన సోదరులు మాదాల కోటయ్య, మరొక కామ్రేడ్ మాదాల నరసయ్యలను పోలీసులు తుపాకీలతో కాల్చి చంపారన్నారు. మద్దిపాడు మండలం మాదేళ్ల గుంట పాలెం కు చెందిన ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ పార్టీ నిషేధిత కాలంలో మూడు సంవత్సరాల పాటు అజ్ఞాత జీవితం గడిపారు అన్నారు. అలాగే కటారి బలరామిరెడ్డి, నా పని వెంకటస్వామి, పెరవలి శ్రీరాములు, గుజ్జుల ఎలమందారెడ్డి, ఆయన సతీమణి గుజ్జుల సరళ దేవి, గురు స్వామి రెడ్డి, p మస్తానయ్య, కొమ్ము కాశిరెడ్డి, పడమనేని రాములు, సోడా రెడ్డి, రావుల వెంకయ్య, హే అరుణమ్మ, రావులపల్లి చెంచయ్య, చెన్నయ్య, తుపాకుల బసవయ్య, కె వి వి ప్రసాద్ వంటి వారు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు. అలాగే కళా రంగంలో మాదాల రంగారావు, టి కృష్ణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, చంద్ర నాయక్ వంటి ఆణిముత్యాలను అందించిన జిల్లా ప్రకాశం జిల్లా అని పేర్కొన్నారు. మహాసభలను సిపిఐ కేంద్ర సమితి సభ్యురాలు కామ్రేడ్ వహీదా పర్వీన్ ప్రారంభిస్తూ ప్రస్తుతం పార్టీ మాజీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతితో భాద లో ఉందన్నారు. గొప్ప నాయకుడ్ని కోల్పోయామన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సిపిఐ లో సభ్యులుగా కొనసాగుతున్నందుకు మనమంతా గర్వపడాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీ ఎల్లప్పుడు పోరాటాలతో, ఉద్యమాలతో పేద ప్రజలు, కార్మికులకు అండగా ఉద్యమాలను చేస్తూ, సైంటిఫిక్ గా ఆలోచిస్తూ ముందుకు నడుస్తుంది అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని తరిమి కొట్టేందుకు సిపిఐ నాయకులు జైలుకు వెళ్లాలని, ఆస్తులు పోగొట్టుకున్నారని, బలిదానాలు చేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే అదే స్థాయిలో ఆర్ ఎస్ ఎస్ ఏనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. బ్రిటిష్ వారికి తొత్తులుగా మారి స్వాతంత్ర సమరయోధులను ఇబ్బందులు పెట్టిన ఆర్ఎస్ఎస్ నాయకులు అని గుర్తు చేశారు. అలాంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన బిజెపి నేడు దేశంలో పాలన సాగిస్తుందన్నారు. ఎర్రకోటపై స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ స్వతంత్ర సమర యోధులను తలుచుకోకుండా కేవలం ఆర్ఎస్ఎస్ నాయకుడైన సావర్కర్ ను పొగడటం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని తీసుకువచ్చేందుకు బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. పేద ప్రజలకు దక్కవలసిన దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారన్నారు. మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. పార్టీ నిర్మాణం గ్రామీణ స్థాయి నుండి బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలలోకి యువత ఎక్కువగా రావాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ సూరవరం మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మతోన్మాద పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఐక్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.ట్రంప్ టారిఫ్ ల పేరుతో పేరుతో దేశంపై దాడి చేస్తున్నారన్నారు. రష్యా, చైనా, భారత్ ఏకమైతే అమెరికా ఆధిపత్యాన్ని కొల్లగొట్టలేమా అని ప్రశ్నించారు. పెహల్గాం యుద్ధాన్ని ట్రంప్ ఆపమంటేనే మోడీ ఆపాడని పేర్కొన్నారు. దేశ ప్రజలకు అండగా అమెరికాకి వ్యతిరేకంగా మోడీ ట్రంప్ ని ప్రశ్నించే దమ్ము లేదా అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ను లొంగ తీసుకొని ఓట్లను తొలగిస్తున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యం పై దాడి అన్నారు. 30 రోజులు జైలులో ఉంటే పదవులు పోయే చట్టం చేస్తున్నామని ప్రతిపక్ష పార్టీలను బిజెపి బ్లాక్ మెయిల్ చేస్తుందన్నారు. బిజెపిపై పోరాటమే ఏజెంట్గా వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. మోడీ బాటలోనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా పాలన సాగిస్తున్నారు. మనువాదుల ఎజెండాను టిడిపి, జనసేన భుజానికి ఎత్తుకున్నాయన్నారు. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ జనసేన అని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మానివేశారన్నారు. గతంలో జగన్ చేసిన తప్పులు చంద్రబాబు నాయుడు కూడా చేస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు మాటలకు, చేతలకు సంబంధం లేకుండా పాలన సాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా వైసిపి విఫలమైందన్నారు. దాని స్థానంలో వామపక్షాలు కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడుతూ నాడు జగన్, నేటి చంద్రబాబు నాయుడు ప్రజలను గాలికి వదిలేసి పాలన సాగిస్తున్నారు. కార్పొరేట్ శక్తులను వెంటవేసుకొని దోచిపెడుతున్నారన్నారు. భారత రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వామపక్ష పార్టీలపై ఉందన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర మహాసభలలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన సిపిఐ జాతీయ నాయకులు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ వెంకయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారానే వారి ఎత్తులను తిప్పి కోట కలుగుతున్నామన్నారు. కర్ణాటక రాష్ట్రంలో రైతులకు చెందిన 18 వందల ఎకరాల భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటే 1200 రోజులపాటు పోరాటం చేసి తిరిగి భూములను సాధించుకున్నామన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కరేడులో 8500 ఎకరాల భూమిని లాక్కున్నారని, భూమి రైతులకు దక్కేవరకు పోరాటం ఆగదని పేర్కొన్నారు. రైతులకు భూమి దగ్గర రైతుల పక్షాన సిపిఐ నిరుస్తుందని పేర్కొన్నారు. మహా టివి ఎండి మారెళ్ళ వంశీకృష్ణ మాట్లాడుతూ సిపిఐ 100 సంవత్సరాల పండుగ సందర్భంగా ఒంగోలులో 28వ రాష్ట్ర మహాసభలను నిర్వహించటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. జిల్లాలో ప్రజలు కష్టపడే తత్వం కలవాలని, మంచి తనానికి ప్రతిరూపంగా నిలుస్తానన్నారు. కొత్తపట్నం కమ్యూనిస్టు పాఠశాల రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కమ్యూనిస్టు పార్టీ కి బీజాలు వేసింది అని చెప్పటానికి గర్వపడుతున్నామన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. అలాగే మీడియా స్వేచ్చకు భంగం వాటిల్లకుండా నిర్వహించే పోరాటాలలో సిపిఐ అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి కమ్యూనిస్టు పార్టీ చెట్టు నీడలో పెరిగిన కారణంగా తాను ఈరోజు నాయకుడిగా ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలు పోరాటంలో అండగా ఉండటంతో పాటుగా భాగస్వామ్యం కావాలని కోరారు. ఈపాటికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యమంత్రికి అనేక పర్యాయాలు లేఖలు రాసిన సంగతిని గుర్తు చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా, కుల నిర్మూలన కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం సాగే పోరాటాలలో మీడియాగా తమ వద్దు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చంద్ర నాయక్, చిన్నం పెంచలయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ రామకృష్ణ, కోశాధికారి పిచ్చయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కళారూపాలు, బుర్రకథ ఈ సందర్భంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సిపిఐ కేంద్ర సమితి సభ్యురాలు అక్కినేని వనజ, ఏపీ ప్రజానాట్యమండలి కళాకారులు మాదాల రవి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, సిపిఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *