-అధికారులందరూ భాగస్వామ్యం కావాలి..
-జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలలో మూడవ శనివారం ఒక ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.
శనివారం ఉదయం ఆయన నగరంలోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని కార్యాలయ ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం ఆయన పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో తిరుగుతూ బలహీనంగా ఉన్న భవనాన్ని పరిశీలించారు. పశువులతో పాటు పెంపుడు కుక్కలకు అందిస్తున్న వైద్య సేవలను ఆ శాఖ జిల్లా అధికారి చిన నరసింహులు కలెక్టర్ కు వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లాలో ప్రతి నెలలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛమైన గాలి (క్లీన్ ఎయిర్) అనే ఇతివృత్తంతో ఈ నెలకు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నగరంలో కాలుష్య రహిత వాయువు లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా 5కె సైక్లోథాన్ అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించామన్నారు. పెట్రోల్, డీజిల్ చమురు ఆధారిత వాహనాలకు బదులుగా సైకిల్ వినియోగించడం ద్వారా వాయు కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. దీనితోపాటు థర్మల్ పవర్ విద్యుత్కు బదులుగా సౌర శక్తి విద్యుత్ ను వినియోగించాలని, ప్రయాణాలకు విద్యుత్ వాహనాలు, ప్రజారవాణాను వినియోగించాలని తద్వారా వాయు కాలుష్యంను తగ్గించడంలో తమ వంతు కృషి చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కు ప్రతి ఉద్యోగి సైకిల్ లేదా కాలినడకన విధులకు హాజరు కావాలని, నగరం బయట నుంచి వచ్చే వారు కార్లు లేదా ద్విచక్ర వాహనాలను షేర్ చేసుకుని రావాలని ఆదేశాలు ఇచ్చామని, తద్వారా వాయు కాలుష్యం తగ్గేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో భాగంగా నేడు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శుభ్రం చేసిన రీతిలో ఇకనుండి ప్రతి నెలలో మూడవ శనివారం ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఎంచుకుని, ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి శుభ్రం చేసే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు.
కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, మచిలీపట్నం మార్కెట్ యార్డు ఛైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ జెడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, హౌసింగ్ ఇంచార్జ్ పిడి విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, డ్వామా పీడీ ఎన్వీ శివ ప్రసాద్ యాదవ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిణి ఝాన్సీ లక్ష్మీ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు తదితర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News