Breaking News

అభివృద్ధి నిలయంగా ఏపీని మారుస్తున్నాం

– రాష్ట్ర అభివృద్ధే ఏకైక లక్ష్యంగా కూటమి పని చేస్తోంది
– ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావేదిక
– గతంలో సమస్యలు వినే నాధుడే లేక ప్రజలు అవస్థలు
– నేడు ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ప్రజల్లోనే
– పని చేసే ప్రభుత్వంపై నిందలేస్తే సహించేది లేదు
– మచిలీపట్నం పార్టీ కార్యాలయం వద్ద ప్రజావేదికలో మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని అభివృద్ధి కేంద్రంగా మలచడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుని పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగ్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ప్రజా వేదిక నిర్వహించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాణం ద్వారా ప్రజలకు హక్కులు కల్పించిన అంబేద్కర్ స్పూర్తిని కాపాడుకునేలా పని చేసినపుడు మాత్రమే అసలైన నివాళి అన్నారు.

గ్రీవెన్స్ కు వచ్చిన పలువురి నుండి వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తక్షణమే సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రతి వారం గ్రీవెన్స్ నిర్వహించడంతో పాటుగా వాటిని సకాలంలో పరిష్కరించడం కూటమి ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం. గత ఏడాది కాలంలో మచిలీపట్నం నియోజకవర్గంలో సుమారు 2264 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 90 శాతం పరిష్కరించామన్నారు. ఎక్కువగా ఇళ్ల నిర్మాణాలు, టిడ్కో ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులే వస్తున్నాయని, త్వరగా ఇళ్ల నిర్మాణం ద్వారా సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. గత ఐదేళ్ల కాలంలో ఇళ్ల నిర్మాణాలను గాలికి వదిలేయడంతోనే ఇప్పుడు ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. నియోజకవర్గంలో 6000 ఇళ్ల నిర్మాణానికి హామీ ఇచ్చామని, వాటిని సాకారం చేసి చూపిస్తామన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చిన చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

గతంలో సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక ప్రజలు ముప్పుతిప్పలు పడేవారు. సచివాలయంలో ఫిర్యాదు చేస్తే వాటిని స్థానిక వైసీపీ నేతలకు పంపించి వేదింపులకు పాల్పడ్డారు. కానీ నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా.. ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ప్రజల్లోనే తిరుగుతున్నారు. ప్రతి వారం గ్రీవెన్స్ నిర్వహించి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరికి పరిష్కారం చూపించి పంపిస్తున్నాం.

రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో అగ్రస్థానంలో నిలిపిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి విద్యార్ధుల స్థితిగతుల్ని తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. తల్లికి వందనం ప్రతి బిడ్డకీ అమలు చేశాం. 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. అన్నదాత సుఖీభవతో రైతులకు అండగా నిలుస్తున్నాం. రైతులతో చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాం. వర్షాల కారణంగా ఇబ్బందులు పడిన రైతులను కూడా ఆదుకున్నాం. భవిష్యత్తులో రైతులకు డ్రైయర్లు అందుబాటులో ఉంచబోతున్నాం. ప్రతి గింజనూ కొనుగోలు చేయడంతో పాటుగా, ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం.

నిన్న జగన్ రెడ్డి నలుగురు సెలెక్టెడ్ జర్నలిస్టుల్ని పిలిపించుకుని సుమారు నాలుగు గంటల పాటు నాలుగు గోడల మధ్య ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడో అతనికే తెలియాలి. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు. ఇప్పుడు దొంగల్ని, కూనీకోర్లను వెనకేసుకు వస్తున్నాడు. తిరుమల వెంకన్నస్వామి వారికి చెందిన సొమ్ము కొట్టేస్తే చిన్న దొంగతనం అంటూ సమర్ధిస్తున్నాడు. కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసిన వ్యక్తిని అమాయకుడు అంటున్నాడు. గంజాయి స్మగ్లర్లను చిన్న పిల్లలు అంటూ మాట్లాడుతున్నాడు. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని ప్రయత్నిస్తుంటే.. జగన్ రెడ్డి మాత్రం అరాచకాలు చేయాలని, అకృత్యాలకు పాల్పడాలని రెచ్చగొడుతున్నారు.

మచిలీపట్నంను అభివృద్ధికి కేంద్రంగా మలిచేందుకు సాయశక్తులా శ్రమిస్తున్నాను. త్వరలోనే పోర్టును పూర్తి చేయబోతున్నాం. చిన్నాపురం-కమ్మవారి చెరువు రోడ్డు నిర్మాణాన్ని పున:ప్రారంభిస్తాం. విజయవాడ రోడ్డును రూ.2 కోట్లతో చేపట్టబోతున్నాం. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో కొత్త రోడ్ల పనుల్ని చేపట్టనున్నాం. బందరుకోట-గరాలదిబ్బ-పోలాటితిప్పలోని వంతెనల నిర్మాణానికి రీ ఎస్టిమేషన్స్ సిద్ధం చేసి పనులు చేపడతాం. రైల్వే లైన్ల గురించి కేంద్ర మంత్రితో చర్చలు జరుపుతున్నాం. మచిలీపట్నం పోర్టు నుండి రేపల్లె రైల్వే లైను పనులు చేపట్టేందుకు ఫీజుబిలిటీ నివేదిక సిద్ధమవుతోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *