Breaking News

“సొంత ప్యాలెస్‌లకు వేల కోట్లు.. ప్రజా రాజధానికి సున్నాలా?”

– “నాడు అసెంబ్లీలో ‘జై’.. అధికారం రాగానే ‘నై’.. ఇది కదా అసలైన వంచన!”
– పీపీపీ విధానంలో వచ్చే సంస్థలను “మేం వస్తే అరెస్ట్ చేస్తాం” అని బెదిరించడం జుగుప్సాకరం.
– “కులాల మధ్య చిచ్చు.. ప్రాంతాల మధ్య విషం.. ఇదే జగన్ రెడ్డి నీచ రాజకీయం!”*
-11 సీట్లకు పడిపోయినా ఇంకా మీ “తాచుపాము” బుద్ధి మారకపోవడం దౌర్భాగ్యం.
-సమాచార శాఖ, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా రాజధాని అమరావతితోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సమాచార శాఖ, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిగారు స్పష్టం చేశారు . శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. హెల్దీ – హ్యాపీ – వెల్తీ స్టేట్ అనే నినాదంతో ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వ పాలనలో గత మూడు రోజులుగా రాష్ట్రమంతా సంక్రాంతి సంబరాలు ఆనందంగా జరుపుకోవడం నిజంగా హర్షణీయం. గ్రామగ్రామాన ప్రజల్లో కనిపించిన సంతోషం, భవిష్యత్తుపై ఉన్న ఆశలు ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, యువతకు ఉపాధి–ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ స్థాయికి చేరుతుంది అనే ప్రజల నమ్మకమే కూటమి ప్రభుత్వానికి బలం.

అయితే ఈ ఆశాజనక వాతావరణాన్ని భగ్నం చేయడమే అలవాటుగా మార్చుకున్న వైసీపీ రాష్ట్ర అభివృద్ధిపై, పెట్టుబడులపై విషం చిమ్ముతోంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా బెదిరింపులు, భయభ్రాంతులు సృష్టిస్తోంది. ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఎంత అవసరమో, ఆ రాజధానిపై ప్రజల్లో నమ్మకం కలిగించడం కూడా అంతే అవసరం. గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వచ్చినా ఉపాధి దొరికేలా రాజధాని ఉండాలి అనే ఆలోచనతోనే అమరావతి రూపకల్పన జరిగింది. దురదృష్టవశాత్తూ 2019–24 మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రజల కలలన్నీ విధ్వంసమయ్యాయి. ఐదేళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా ప్రజలు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌ను మించిన నగరాన్ని నిర్మిస్తానని చెప్పారు. కానీ విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మించే హక్కు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిని ప్రతిపాదించగా, అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా మద్దతిచ్చారు. అలాంటి వ్యక్తి తర్వాత అమరావతిని ఎలా విధ్వంసం చేశారో రాష్ట్ర ప్రజలు మరవలేరు.

2014లో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని నమ్మి 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సుమారు 33 వేల ఎకరాల భూమిని త్యాగం చేశారు. ప్రభుత్వ భూములు కలిపి దాదాపు 50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు అందరూ నివసించేలా సమగ్ర నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. అయితే రాజధాని నడిబొడ్డులో ఉండాలి, కనీసం 30 వేల ఎకరాలు కావాలి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో అమరావతే రాజధాని, తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా అనుమానం అవసరం లేదని నమ్మబలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తుగ్లక్ పాలనను గుర్తు చేసేలా మూడు రాజధానుల వాదన తెరపైకి తెచ్చి విధ్వంసం సృష్టించారు. ఐదేళ్లలో ఒక్క రాజధానికైనా స్పష్టమైన ప్రణాళిక లేదా కార్యాచరణ చూపలేకపోయారు. అమరావతిని ఎడారితో పోల్చడం, స్మశానం లా ఉందని అనడం, అంతేకాక భూములు ఇచ్చిన రైతులను అవమానించడం చేశారు. ఐదేళ్లు నిరసనలు చేసిన రైతులు, మహిళలపై పోలీసులతో దౌర్జన్యాలు చేయించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ అసెంబ్లీలో మాటల యుద్ధం చేసి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకున్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల నుంచి చివాట్లు పడినా కూడా సిగ్గుపడలేదు. రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తే అడ్డంకులు సృష్టించారు. చివరకు 2024 ఎన్నికల్లో ప్రజల కోపానికి గురై కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు.

ఎన్నికల తర్వాత కూడా మాటలు మారుస్తూనే ఉన్నారు. ఒకప్పుడు 30 వేల ఎకరాలు కావాలన్నవాళ్లు, ఇప్పుడు 500 ఎకరాలు చాలని అంటున్నారు. తమ వ్యక్తిగత అవసరాలకు వందల ఎకరాలు, వేల చదరపు అడుగుల భవనాలు కట్టుకున్నవాళ్లు ఐదు కోట్ల ప్రజలకు రాజధాని అవసరమా అని ప్రశ్నించడం ఎంత దుర్మార్గం. రాజధానిపై ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, అమరావతిని ఒక ప్రాంతానికే చెందిన నగరంగా చిత్రీకరించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు సైబరాబాద్ ఆలోచన చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. కానీ ఈరోజు అక్కడ భూముల విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు. అమరావతిలో కూడా అభివృద్ధి పూర్తి స్థాయికి రాకముందే భూములు కోట్లలో పలుకుతున్నాయి. భవిష్యత్తులో క్వాంటం వ్యాలీ, అంతర్జాతీయ విద్యా సంస్థలు, బ్యాంకింగ్ స్ట్రీట్, ఐటీ హబ్‌లు వస్తే రాష్ట్రానికి లక్షల కోట్ల ఆస్తి సంపద ఏర్పడుతుంది. అదే ఆదాయంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పనులు మళ్లీ ఊపందుకున్నాయి. వేల కోట్లతో లేఅవుట్ల అభివృద్ధి, రహదారులు, సెక్రటేరియట్, అసెంబ్లీ, మంత్రుల క్వార్టర్స్, ఐఏఎస్ నివాసాలు, ఫ్లడ్ మిటిగేషన్ పనులు, ప్రపంచ బ్యాంక్–ఏడీబీ నిధులతో మౌలిక సదుపాయాలు ప్రారంభమయ్యాయి. 30 శాతం గ్రీన్ కవర్, 10 శాతం వాటర్ కవర్‌తో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. అంతేకాదు, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో టీసీఎస్, రిలయన్స్ వంటి సంస్థల పెట్టుబడులు వచ్చాయి. కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే – అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి. రాజధాని ఎంత పెద్దగా ఉండాలి అనేది ఒక వ్యక్తి ఇష్టానుసారం కాదు; ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్తు అవసరాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసకర రాజకీయాలను మానుకోవాలి. అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలంటే ధైర్యం ఉండాలి. బయట కూర్చొని విషప్రచారం చేయడం ప్రజలకు హాని చేయడం మానుకోవాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తోంది. ఈ నిజాన్ని ప్రజలు గుర్తించాలి, విధ్వంస రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి పార్థసారధి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *