Breaking News

రైల్వేల్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల వివరాలు తెలుపండి

-రైల్వే ట్రాక్‌ల వెంట, స్టేషన్ల పరిసరాలలో పేరుకుపోతున్న చెత్త గురించి పార్లమెంటులో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రైల్వేల్లో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యపై తిరుపతి లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి బుధవారం పార్లమెంటులో ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ రైల్వే ట్రాక్‌ల వెంట, స్టేషన్ల పరిసరాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, ఆహార ప్యాకెట్లు తదితర వ్యర్థాలు వేస్తున్న పరిస్థితిని ఆయన ప్రస్తావించారు. రైళ్లలో డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఈ సమస్య ఎందుకు కొనసాగుతోందని, వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, రీసైక్లింగ్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్లాస్టిక్ చెత్తను ట్రాక్‌లపై వేయకుండా పర్యవేక్షణ వ్యవస్థ, జరిమానా విధానం ఉందా అనే అంశాలపై వివరాలు కోరారు.

ఈ ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ రైల్వేల్లో వ్యర్థాల నిర్వహణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రైళ్లలో సేకరించిన చెత్తను మార్గమధ్యంలో గుర్తించిన స్టేషన్లలో శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. రైళ్లలో పనిచేసే హౌస్‌కీపింగ్ సిబ్బందికి ట్రాక్‌లపై చెత్త వేయరాదని కఠిన ఆదేశాలు జారీ చేశామని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ట్రాక్‌ల వెంట రాగ్ పికింగ్ ద్వారా నిరంతర శుభ్రత నిర్వహిస్తున్నామని తెలిపారు.

స్టేషన్లలో బయోడిగ్రేడబుల్, నాన్-బయోడిగ్రేడబుల్ వ్యర్థాల వర్గీకరణ కోసం రెండు బిన్‌ల విధానం అమలు చేస్తున్నామని అన్నారు. అవసరాన్ని బట్టి ప్లాస్టిక్ బాటిల్ క్రషింగ్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మున్సిపల్ సంస్థలతో కలిసి వ్యర్థాల నిర్వహణకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. అవసరమైన చోట్ల మురుగునీటి శుద్ధి కేంద్రాలు, వర్క్‌షాపులు, లోకో షెడ్లలో నుంచి వచ్చే రసాయన మలిన జలాల శుద్ధి కోసం ఎఫ్లువెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, అలాగే మెటీరియల్ రికవరీ ఫెసిలిటీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకు నిరంతరం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, డివిజనల్, జోనల్, హెడ్‌క్వార్టర్ స్థాయిలో రెగ్యులర్, ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రయాణికుల కోచ్‌లలో బయో టాయిలెట్ల ఏర్పాటు ద్వారా ట్రాక్‌లపై మానవ వ్యర్థాల ప్రత్యక్ష విడుదలను పూర్తిగా నిలిపివేశామని వెల్లడించారు. 2004 నుండి 2014 వరకు 9,587 బయో టాయిలెట్లు ఏర్పాటు చేయగా, 2014 నుండి ఇప్పటివరకు 3,61,572 బయో టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *