Breaking News

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ కీర్తి కిరీటం విశాఖపట్నం

-శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
-విశాఖ పరిసర ప్రాంత అభివృద్ధికి రూ. 8,650 కోట్ల పెట్టుబడులతో 50 ఒప్పందాలు కుదుర్చుకున్నామని స్పష్టం
-హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో అంతర్జాతీయ స్థాయిగా విశాఖపట్నంను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న మంత్రి దుర్గేష్
-సీ-ప్లేన్, క్రూజ్ సర్క్యూట్, హెలీ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించామని వివరణ
-విశాఖను అడ్వెంచర్, యాంకర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి దుర్గేష్ వెల్లడి
-విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలను మూడు పర్యాటక హబ్ లుగా చేయాలన్నదే తమ లక్ష్యమన్న మంత్రి కందుల దుర్గేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో విశాఖపట్నం ఒక కలికుతురాయి అని, దానిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్. వంశీ కృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి కందుల దుర్గేష్ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.

నూతన పర్యాటక పాలసీ (2024-29)తో విశాఖను యాంకర్ హబ్‌గా చేస్తూ ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌లో సింహాచలం, బౌద్ధ, బీచ్, ఎకో టూరిజం థీమాటిక్ సర్క్యూట్‌లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఇటీవల జరిగిన సీఐఐ సమ్మిట్ ద్వారా రూ. 8,650 కోట్ల విలువైన 50 ఒప్పందాలు కుదిరాయని, తద్వారా ఒబేరాయ్, తాజ్, మేఫెర్, అట్నాస్పియర్ కోర్ వంటి ప్రముఖ హోటల్ సంస్థలు విశాఖకు వస్తున్నాయన్నారు. అదే విధంగా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డులో 16 ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందన్నారు. తద్వారా విశాఖలో 2858 రూమ్ ల ఏర్పాటుకు రూ.4098 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ కింద సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి రూ. 54.04 కోట్లు, స్వదేశీ దర్శన్ 2.0 కింద బొర్రా గుహల అభివృద్ధికి రూ. 28.87 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేశామన్నారు. రుషికొండ, తిమ్మాపురం, సాగర్ నగర్ బీచ్, భీమిలి దగ్గర గోస్తనీ బ్యాక్ వాటర్స్ తదితర ప్రాంతాల్లో స్కూబా డైవింగ్, పారా మోటరింగ్ వంటి 10 రకాల జలక్రీడలు ప్రారంభమయ్యాయన్నారు. 6 నెలల్లో 25 కంటే ఎక్కువ కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు.విశాఖలో ప్రభుత్వం, ట్రావెల్ మార్ట్ తో కలిసి సమీపంలోని తొట్ల కొండ, బావికొండ లను కలుపుతూ బౌద్ధ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోందన్నారు. విశాఖ-భువనేశ్వర్- కోల్ కత్తా, విశాఖపట్నం- చెన్నై-ట్యూటికోరన్ ను సీ క్రూజ్ సర్క్యూట్ గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశామన్నారు. విశాఖ-అరకు సీ ప్లేన్, హెలీ టూరిజం, విశాఖ-చెన్నై-పుదచ్చేరి క్రూజ్ సర్వీసులను బలోపేతం చేస్తున్నామన్నారు.హైదరాబాద్ – విశాఖపట్నం మధ్యలో క్యారవాన్ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ మధ్య కాలంలో క్యారవాన్ పాలసీని కూడా తెచ్చామన్నారు. తద్వారా అన్ని ప్రాంతాల్లో క్యారవాన్ పార్క్ లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. అదే విధంగా ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో విశాఖ నుండి భీమిలీకి మధ్య ఉన్న సందర్శక ప్రాంతాలన్నీ పర్యాటకుడు సందర్శించేలా ప్రారంభించబడిన హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సుల ద్వారా సత్ఫలితాలొస్తున్నాయన్నారు. భారత్ మండపం తరహాలో ఏపీలో ఆంధ్రా మండపాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. తద్వారా విశాఖలోని బీచ్ లను అభివృద్ధి చేయాలని, విశాఖలోని ఎకనమిక్ రీజియన్ క్రింద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ఈ రంగానికి ఊతమిచ్చినట్లైందన్నారు. తద్వారా స్థానికులకు ఉపాధి కల్పించేలా హోమ్ స్టే పాలసీ, బ్రెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానం తీసుకొచ్చి 490 హోమ్ స్టేలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సీఆర్ జెడ్ నిబంధనలపై స్పష్టత:

ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు కోరిన విధంగా బీచ్ రోడ్డులో నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న సీఆర్ జెడ్ జోన్ 3 నుండి జోన్ 2కి మార్చే అంశాన్ని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.’సీఆర్ జెడ్ 19′ అమల్లోకి వస్తే పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా తమ ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సభలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, పర్యాటకులు విదేశాలకు వెళ్లకుండా విశాఖలోనే అంతర్జాతీయ స్థాయి ఎంటర్ టైన్ మెంట్ హబ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-24 కాలంలో కుదేలైన పర్యాటక రంగాన్ని మళ్లీ పట్టాలెక్కించామని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.ఈ క్రమంలో విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలను మూడు హబ్ లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. రాష్ట్ర పర్యాటక రంగానికి తాము చేస్తున్న కృషి, ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని పర్యాటక కార్యక్రమాలు చేపట్టి పర్యాటకాభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *