Breaking News

పూర్తికాని వెలుగొండను.. జాతికి అంకితమంటూ జగన్ మోసగించారు

-గుండ్లకమ్మ గేట్లు విరగ్గొట్టి ఇసుక దోపిడీ చేశారు
-ఐదేళ్ల‌లో అన్ని వ్య‌వ‌స్థ‌ల్నీ జ‌గ‌న్ రెడ్డి భ్ర‌ష్టు ప‌ట్టించాడు
-కూట‌మి ప్ర‌భుత్వంలో ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేస్తున్నాం
-ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామంటూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ప్రజలను మోసగించారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. పనులు పూర్తిచేయకుండా కేవలం ప్రచారానికే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. రైతుల ఆశలను వమ్ము చేస్తూ ప్రాజెక్టును రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకున్నారని విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ధ్వంసం చేసి, భారీ ఎత్తున ఇసుక దోపిడీ చేశారని అన్నారు. ప్రజా సంపదను కాపాడాల్సిన ప్రభుత్వం దానినే దోచుకుందన్నది దురదృష్టకరమన్నారు. ఇలా జగన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను జగన్ రెడ్డి భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలో బుధ‌వారం నాడు సీఎం చంద్ర‌బాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌జా వేదిక బహిరంగ స‌భ‌లో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… కూట‌మి ఏర్ప‌డిన వెంట‌నే గుండ్ల‌క‌మ్మ‌కు కొత్త గేట్ల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు మ‌త్స్య‌కారుల సంక్షేమం కోసం 20 ల‌క్ష‌ల చేప పిల్ల‌ల‌ను గుండ్ల‌క‌మ్మ‌లో వ‌దిలిన విష‌యాన్ని మంత్రి స‌భా ముఖంగా గుర్తు చేశారు. వెలిగొండ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేసేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే రాజ‌ధాని అమ‌రావ‌తి, పోల‌వ‌రం ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా వేగ‌వంతం చేసినట్లు స్పష్టం చేశారు.

సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టిన వెంట‌నే ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. గ‌డిచిన 19 నెల‌ల కాలంలోనే ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి కింద పేద‌ల‌కు వెయ్యి కోట్లు రూపాయిలు స‌హాయం చేశామ‌ని తెలిపారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పేద‌ల పెన్ష‌న్ వెయ్యి రూపాయిలు పెంచ‌డానికే ఐదేళ్లు ప‌ట్టింద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి ఎద్దేవా చేశారు. కూట‌మి ప్ర‌భుత్వంలో అన్ని హామీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. కేవ‌లం ఒక్క సంత‌కంతోనే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పేద‌ల పెన్ష‌న్ ను వెయ్యి రూపాయిలు పెంచార‌ని చెప్పారు. ఆర్థిక అస‌మాన‌త‌లు తొల‌గించ‌డానికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పీ4 కార్యక్ర‌మాన్ని రూపొందించార‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు.

విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం

2019 వ‌ర‌కు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్., వైసీపీ పాల‌న ఐదేళ్ల‌లో స‌ర్వ నాశనం అయ్యింద‌ని మంత్రి గొట్టిపాటి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అడ్డ‌గోలు విద్యుత్ కొనుగోళ్లు, అనాలోచిత నిర్ణ‌యాల‌తో విద్యుత్ వ్య‌వ‌స్థ‌కు రూ.1.29 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం వాటిల్లింద‌ని వెల్ల‌డించారు. పాద‌యాత్ర‌లో ఇచ్చిన దొంగ హామీల‌తో ప్ర‌జ‌ల్ని మోసం చేసి జ‌గ‌న్ అధికారం చేప‌ట్టార‌ని మంత్రి గొట్టిపాటి విమ‌ర్శించారు. ఒక్కాసారి ఓటంటూ అధికారం చేప‌ట్టిన వైసీపీ., రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెన‌క్కి తీసుకెళ్లింద‌ని ఆరోపించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్ర‌జ‌ల‌పై సుమారు రూ.30 వేల కోట్లు విద్యుత్ భారాన్ని మోపార‌న్నారు. కూట‌మి అధికారం చేప‌ట్టిన 15 నెల‌ల కాలంలోనే 13 పైస‌లు ట్రూ డౌన్ చేయ‌డ‌మే కాకుండా., గ‌డిచిన 19 నెల‌ల్లో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీ పెంచ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఆల‌యం అప‌విత్రం…. ల‌డ్డూ క‌ల్తీ….

దేశంలోని హిందువులంద‌రూ అతి ప‌విత్రంగా భావించే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాన్ని కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అప‌విత్రం చేశార‌ని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. కోట్లాది భ‌క్తుల‌కు ఎంతో ప్రీతి పాత్ర‌మ‌యిన తిరుప‌తి ల‌డ్డూని కూడా క‌ల్తీ చేశార‌ని తెలిపారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అన్ని వ్య‌వ‌స్థ‌ల్నీ గాడిలో పెడుతున్నామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. చివరగా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మార్కాపురం ప్ర‌త్యేక‌ జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకరించారని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *