రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల కార్యాలయం, మంగళగిరి వారి సూచనల మేరకు, మార్చి 2026లో నిర్వహించనున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నామినల్ రోల్స్‌లో ఉన్న వివరాల సవరణకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె. వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు.
సవరణల గడువు
26.02.2026 నుండి 28.02.2026 వరకు సవరణలకు అవకాశం కల్పించబడిందన్నారు. అందులో భాగంగా నేడు, ఫిబ్రవరి 28వ తేదీ చివరి అవకాశమని ఆయన పేర్కొన్నారు. విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఏం సవరించుకోవచ్చు?
విద్యార్థి పేరు, పుట్టిన తేదీ తదితర వ్యక్తిగత వివరాలలో దొర్లిన తప్పులను సరిదిద్దుకోవచ్చు.
ఎలా సవరించాలి?
ఆధార్‌తో ధృవీకరించిన వివరాలను మాత్రమే UDISE+ (యూ-డైస్ ప్లస్) పోర్టల్‌లో అప్డేట్ చేయాలి.
ఫిబ్రవరి 26 నుండి 28 వరకు రికార్డులు ఇంకా సరిపోలని విద్యార్థులకు మరొక అవకాశం ఇవ్వడం జరిగిందనీ ఇవ్వనున్నట్లు తెలిపారు. మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో చివరిసారిగా వివరాలు సరిదిద్దు కునేందుకు అవకాశం కల్పించనున్నట్లు సంచాలకులు ప్రభుత్వ పరీక్షల విభాగం, ఆంధ్ర ప్రదేశ్, మంగళగిరి వారు వెల్లడించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థల అధిపతులు ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి, పాఠశాల రికార్డులు మరియు ఆధార్ వివరాల మధ్య ఉన్న వ్యత్యాసాలను వెంటనే సరిదిద్దాలని సూచించారు. తద్వారా మార్కుల మెమోలు, సర్టిఫికెట్లు మరియు భవిష్యత్తు విద్యా రికార్డుల్లో తప్పులు చోటు చేసుకోకుండా నివారించ వచ్చన్నారు. ఆధార్ వివరాలు మరియు పాఠశాల రికార్డుల మధ్య ఏవైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే వాటిని తీవ్రంగా పరిగణిస్తారని, అలాంటి తప్పులకు సంబంధిత విద్యాసంస్థ అధిపతే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
కావున జిల్లా లోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖా ధికారులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుని విద్యార్థుల వివరాలను ఖచ్చితంగా సరిచూడాలని జిల్లా విద్యాశాఖాధికారి కె. వాసుదేవరావు తెలిపారు.
Prajavartha Online Telugu News