తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి నగరంలోని NGO’s కాలనీలోని జనసేన పార్టీ ఆఫీస్ నందు జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని తిరుపతి శాసనసభ్యులు ఆరాణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రజా పార్టీగా ఎదిగిందన్నారు. సమాజంలో న్యాయం, సమానత్వం, పారదర్శక రాజకీయాల కోసం జనసేన పార్టీ స్థాపించబడిందని ఆయన పేర్కొన్నారు. పార్టీ స్థాపన నుంచి ఇప్పటి వరకు జరిగిన పలు సంఘటనలను గుర్తు చేస్తూ, కార్యకర్తల అంకితభావం వల్లే పార్టీ బలంగా నిలబడిందని తెలిపారు. మార్చి 14వ తేదీ జనసైనికులకు, వీర మహిళలకు పండుగ రోజు అని ఆయన అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాలు, నగరాలు, మండల కేంద్రాలు, హడల కేంద్రాలు మరియు పంచాయతీల్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, ఆహార వితరణ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జనసేన పార్టీ ప్రత్యేకత అని డా. హరిప్రసాద్ అన్నారు. అలాగే జనసేన పార్టీ భవిష్యత్తులో మరింత బలంగా ఎదిగి ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News