-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరహాగా ఆంధ్రప్రదేశ్లోనూ ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట’ను అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక£ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు’కు ఆమోదం తెలపడం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) స్వాగతిస్తున్నది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది న్యాయవాదుల భద్రతను పరిరక్షించే దిశగా తక్షణమే సమగ్ర రక్షణ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో సామాన్య ప్రజలకు న్యాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న న్యాయవాదులపై ఇటీవలి కాలంలో దాడులు పెరుగుతున్న పరిస్థితి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో చోటుచేసుకున్న గట్టు వామనరావు దంపతుల హత్య వంటి దారుణ ఘటనలు న్యాయవాద వృత్తి భద్రతపై తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవాదులకు చట్టపరమైన రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా గుర్తెరగాలి.
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 23న తీసుకున్న నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కూడా ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట’పై స్పష్టమైన, తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాదుల విధి నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలిగించినా, లేదా వారిపై భౌతిక దాడులకు పాల్పడినా, అలాంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తూ నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినమైన శిక్షలు విధించేలా చట్టంలో పటిష్టమైన నిబంధనలు ఉండాలని సూచిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని కోర్టు ఆవరణల్లో న్యాయవాదులు, కక్షిదారుల భద్రతను నిర్ధారించే విధంగా సమగ్ర భద్రతా చర్యలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాకుండా, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి చట్టరూపం దాల్చేలా తక్షణ చర్యలు చేపట్టి, ఎపీలో న్యాయవాదులకు పూర్తి భద్రత కల్పించాలని కోరుతున్నామన్నారు.
Prajavartha Online Telugu News