-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రైస్తవం స్వీకరించిన వ్యక్తులు ఎస్సిల కిందకు రారని సుప్రీం కోర్టు స్పష్టంచేయడం దురదష్టకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల వారు మినహా ఏ మతాలవారూ ఎస్సిల కిందికి రారంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం విచారకరం. షెడ్యూల్డు కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సి హోదా కోల్పోతారంటూ ఎపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు దళిత క్రిస్టియన్ల మనుగడకు గొడ్డలిపెట్టు. దళిత క్రైస్తవులను ఎస్సి జాబితాలో కొనసాగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ గతం నుండీ డిమాండ్ చేస్తున్న విషయం గమనార్హం. మతం మారినంత మాత్రాన అంటరానితనం పోదనేది వాస్తవం. పైగా బౌద్ధ, సిక్కుమతాలలో చేరిన వారికి మాత్రం ఎస్సి హోదా వర్తిస్తుందని చెప్పడం, క్రిస్టియన్లకు మాత్రం ఎస్సి హోదా పోతుందని చెప్పడం సరైందికాదు. దళిత క్రిస్టియన్లకు ఎస్సి హోదా కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పుపట్ల పున:పరిశీలన జరపాలని కోరుతున్నాం.
నియోజకవర్గాల పునర్విభనకు ముందే జనగణనలో కులగణన చేపట్టాలి : ఈశ్వరయ్య
లోక్సభ, అసెంబ్లీ నియోజకరవర్గాల పునర్విభజన చేయాలని, వాటి సంఖ్య 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో భౌగోళికంగా, రాజకీయంగా పలు కీలకమార్పులు జరుగనున్నాయి. ఎపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175 నుండి 263కు పెరగనుంది.
మన రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలు ఉన్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులు బిసిలు కోల్పోయారు. ఇటీవల తెలంగాణా ప్రభుత్వం జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేపట్టడం వలన ఏయే కులాలు ఎంతమంది ఉన్నదీ లెక్క తేల్చింది. అందుకనుగుణంగా ఎస్సి, ఎస్టి, బిసి వర్గాలకు స్థానిక సంస్థý ఎన్నికలలో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తదుపరి గవర్నర్ను కలిసి ఆమోదించాల్సిందిగా కోరడం జరిగింది.
బీహార్లో కులగణనను చేపట్టి, వివరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కర్నాటకలో రాష్ట్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టింది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసినా కులగణన చేపడితే సమాజంలో విభజన వస్తుందని బుకాయించింది. తదనంతర కాలంలో ప్రతిపక్షాలు, ప్రజల ఒత్తిడికి తలొగ్గి, దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒకవైపు తమ ప్రభుత్వం బిసిల ప్రభుత్వమంటూ జపం చేస్తూనే, మరోవైపు కులగణనను చేపట్టడానికి ముందుకు రాకపోవడం సరైందికాదు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజనకు మునుపే తెలంగాణా రాష్ట్ర తరహాలో ఎపీలో కూడా జనగణనలో కులగణన చేపట్టి, స్థానిక సంస్థల్లో బిసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, యువత ప్రాతినిథ్యం పెరిగే విధంగా ఈ పునర్విభజన దోహదపడాలని కోరుతున్నామన్నారు.
Prajavartha Online Telugu News