- సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు విద్యార్థుల సృజనాత్మక ప్రత్యామ్నాయం
- రీయూజ్, రిడ్యూస్‌పై అవగాహన పెంపు
- విద్యార్థుల్లో సృజనాత్మకతకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం ఉదయం వన్ టౌన్ లో గల మహాత్మా గాంధీ పాఠశాలలో వినియోగించిన పాత దుస్తులతో బ్యాగుల తయారీ పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పాత దుస్తులను తమ చేతులతో బ్యాగ్ కుట్టి తీసుకువచ్చిన వారితో మాట్లాడారు. ఈ బ్యాగ్ దేనితో కుట్టారు? అని అడిగితే, వారు పాత దుస్తులతో కుట్టామని సమాధానం ఇచ్చారు. పాత దుస్తులను మనం ఎందుకు వాడాలి? అని అడగ్గా ఏదైనా వస్తువుని తిరిగి వాడటం, (re-use) వ్యర్ధాలని తగ్గించడం(reduse) అవుతుందని వారు సమాధానం ఇచ్చారు. పాత గుడ్డలనే ఎందుకు వాడాలి ప్లాస్టిక్ ని వినియోగించొచ్చుగా? అని అడిగితే, సింగిల్ యూస్ ప్లాస్టిక్ హానికరం అందుకే పర్యావరణహితమైన వస్తువులనే వాడాలి అని విద్యార్థులు కలెక్టర్ గారికి చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మరియు విఎంసి స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీశ పాత దుస్తులతో అందమైన బ్యాగులుగా కుట్టి తీసుకొచ్చిన విద్యార్థిని విద్యార్థులకు అభినందించారు, వారి సృజనాత్మకతను మెచ్చుకున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరు వారు కుట్టి తీసుకువచ్చిన గుడ్డ సంచులను వాడాలని వారి తల్లిదండ్రులకి ఆ సంచులనే మార్కెట్ కి తీసుకువెళ్లి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని అన్నారు.
తాజాగా వచ్చిన అధ్యయనం ప్రకారం సింగిల్ యూస్ ప్లాస్టిక్ అండ్ వాడటం వల్ల తల్లిపాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తున్నాయని.. ప్లాస్టిక్ భూమిలో కరగనందున అది మన పర్యావరణం లో హానికరమైన పదార్ధంగా మారుతోందని అందుకే పర్యావరణహితమైన వస్తువులనే వాడాలని, కేవలం వాతావరణానికి, భూమికి హాని కలుగుతున్నందుకే కాదు, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటానికైనా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలి అన్నారు. వేడి వేడి ఆహారం, ప్లాస్టిక్ లో వేయడం వలన హానికారక రసాయనాలు అందులో ఉత్పన్నమవుతాయని, ఆ ఆహారాన్ని మనం తినటం వలన అది క్యాన్సర్ కు దారితీస్తుందని అన్నారు.
ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్త అన్నారని, వారిలో ఉన్న సృజనాత్మకతను విస్తృతంగా వాడి ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు. ఈ వేసవి సెలవుల్లో పాత గుడ్డలతో ఎక్కువ సంఖ్యలో బ్యాగులను తయారు చేయాలన్నారు. ఎవరైతే ఎక్కువ బ్యాగులు చేస్తారో వారికి ప్రత్యేక అవార్డును ఇస్తామని వారి తల్లిదండ్రులను సన్మానిస్తామని తెలిపారు. అలా విద్యార్థులు కుట్టిన గుడ్డ సంచులను రైతుబజార్లలో ప్రజలకు ఉచితంగా ఇచ్చి వారికి అవగాహన కల్పించి కేవలం గుడ్డ సంచులను వాడేటట్టు సమాజంలో ఒక మార్పు తీసుకొద్దామని విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చంద్రకళ, విజయవాడ నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సాంబశివరావు,విఎంసి అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బి అన్నపూర్ణ, గాంధీజీ మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్ కె. మల్లికార్జున్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News