- పీఎం సూర్యఘర్ పథకంపై సూర్యాంధ్ర ప్రగతి రథాల ద్వారా విస్రృతి ప్రచారం
- పీఎం సూర్య ఘర్ యూఎల్ఏ (Utility Led Aggrigation) మోడ్ ప్రచారం ప్రారంభం
మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూర్యాంధ్ర ప్రగతి రథాల ద్వారా ప్రజల్లో సౌరశక్తి వినియోగంపై అవగాహన పెంపొందిస్తూ ప్రతి ఇంట్లో సూర్యఘర్ వెలుగులు నింపేందుకు పీఎం సూర్యఘర్ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈఎఫ్ఐ), నెడ్ క్యాప్ సంయుక్త ఆధ్వర్యంలో మైలవరం నియోజవర్గం కేతనకొండ లో శనివారం పీఎం సూర్య ఘర్ యూఎల్ఏ (Utility Led Aggrigation) మోడ్ పథకంలో భాగంగా ఎస్సీ,ఎస్టీ వినియోగదారులకు చెందిన 5 ఇళ్లలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ నుంచి వచ్చే విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానించే కార్యక్రమాన్ని లాంఛనంగా మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం పీఎం సూర్య ఘర్ యూఎల్ఏ (ఉలా) మోడ్ లో ప్రచారానికి ఏర్పాటు చేసిన సూర్యాంధ్ర ప్రగతి రధాన్ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ULA మోడ్ అనేది ఇంటి యజమానుల రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటును సులభతరం చేసే, డిస్కమ్ ఆధారిత ప్రక్రియ.
ఈ సందర్భంగా కేతనకొండలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రతి నెలా సగటున 1800 నుండి 2000 వరకు అద్దె రూపంలో ఆదాయం వచ్చేలా సౌర విద్యుత్ పథకాన్ని ప్రజలకు అందిస్తోందన్నారు. మీ ఇంటిపై ఆర్సీసీ రూఫ్ ఉంటే, ప్రభుత్వం ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, రాబోయే 35 ఏళ్ల వరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ఒకసారి సోలార్ ప్యానెల్స్ కు పెట్టుబడి పెడితే, కేవలం 3 ఏళ్ల లోనే ఆ పెట్టుబడి తిరిగి వస్తుందన్నారు. ఆ తర్వాత దాదాపు 35 ఏళ్ల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. సొంత అనుభవాన్ని వివరిస్తూ, తన ఇంటిపై 17 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల గత ఏడున్నర ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు చెల్లించలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బైకులు, కార్లు వాడకం పెరుగుతుంది కాబట్టి, సోలార్ ప్యానెల్స్ వల్ల ఇంధన ఖర్చులు ఆదా అవుతాయన్నారు.
ట్రూ-అప్ (True-up), ట్రూ-డౌన్ (True-down) చార్జీలు:
గత ప్రభుత్వం విద్యుత్ శాఖ ఖర్చులు పెరిగినప్పుడు, ఆ భారాన్ని ట్రూ-అప్ చార్జీల రూపంలో వినియోగదారులపై వేసారు. దీనివల్ల సామాన్యుల నుండి పారిశ్రామికవేత్తల వరకు అందరికీ అదనపు భారం పడేదన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కే. పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల నేతృత్వంలోని ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల్లో హామీ ఇచ్చిందన్నారు.
ట్రూ-డౌన్ చార్జీలు: ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లలో పొదుపు పాటించడం వల్ల, చరిత్రలో మొదటిసారిగా విద్యుత్ ధరను 13 పైసలు తగ్గించిందని, దీనినే ట్రూ-డౌన్ అని పిలుస్తారన్నారు.
ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఇళ్లు వేరే వాళ్ళ పేరు మీద ఉండటం లేదా వారసులుగా పేర్లు మార్చుకోకపోవడం వంటి కారణాల వల్ల కొందరికి ఈ పథకం అందడం లేదు, అటువంటి వారు వెంటనే పేర్లు మార్పిడి చేసుకోవాలని సూచించారు. సోలార్ ప్యానెల్స్ నిర్వహణ చాలా సులభం, కేవలం 10 రోజులకు ఒకసారి నీళ్లతో క్లీన్ చేస్తే సరిపోతుందన్నారు. ఎస్సీ, ఎస్టీలపై ఎటువంటి విద్యుత్ భారం పడకూడదనే ఉద్దేశంతో ఎటువంటి ఖర్చు లేకుండా ఈ పథకాన్ని ఉచితంగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం పీఎం సూర్య ఘర్ ఊలా పథకానికి ఉన్నందున ప్రస్తుతమున్న అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పథకం వర్తింపులో ఎటువంటి రాజకీయ పక్షపాతం లేదా కుల వివక్ష లేదని, ఎస్సీ మరియు ఎస్టీలకు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉందని చెప్పారు. మిగిలిన వర్గాలకు కూడా రాయితీ (సబ్సిడీ) లభిస్తుందని వివరించారన్నారు. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా సుమారు 35 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ పొందవచ్చని, సబ్సిడీ పోను కేవలం ఒకసారి చేసే ఖర్చు సుమారు 75 నుండి 80 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ పథకాన్నిఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక ఉత్తమ నమూనాగా నిలిపేలా అమలు చేయాలని కోరారు. షెడ్యూల్ కులాలు తెగల వర్గాలకు నూరు శాతం సబ్సిడీ, ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉందన్నారు.
కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి చెరుకూరి ఉదయ్ మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పీఎం సూర్య ఘర్ రథాలు, ఇంటింటికీ చేరుకుని సౌర విద్యుత్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను, గృహాల పైకప్పులపై సౌర ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని వివరిస్తాయన్నారు. ప్రత్యేకంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని, స్వయం విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆర్థిక భారం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సౌర శక్తి వినియోగంపై ఆసక్తి పెరిగి, రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి వినియోగం విస్తృతంగా పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డీఈ రవి చంద్ర, నెడ్ కాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ షేక్ మౌలాలి పాల్గొన్నారు.
జారీ చేసినవారు: సహాయ సంచాలకులు రాష్ట్ర సమాచార కేంద్రం, విజయవాడ
Prajavartha Online Telugu News