-కూటమి ప్రభుత్వ దక్షతతో జాతీయ స్థాయిలో ఏపీ పర్యాటకానికి అరుదైన గుర్తింపు
-“ప్రకృతి అందాలను అనుభవించాలంటే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిందే” – నీతి ఆయోగ్ కీలక సిఫార్సు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత దేశంలోని వివిధ రాష్ట్రాల వైవిధ్యభరితమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక , సహజ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ నీతి ఆయోగ్ విడుదల చేసిన “దివ్య భారత్ – ఏ విండో టు ది సోల్ ఆఫ్ ఇండియా” నివేదికలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి పెద్దపీట వేసింది. కూటమి ప్రభుత్వ కృషితో రాష్ట్ర పర్యాటక రంగం నేడు అద్భుత ప్రగతి ప్రయాణాన్ని సాగిస్తోందని ఈ నివేదిక చాటిచెప్పింది.
ప్రపంచ పటంలో ఏపీ పర్యాటక వైభవం:
నీతి ఆయోగ్ విడుదల చేసిన 13 పేజీల సమగ్ర నివేదిక మరియు 1.20 నిమిషాల నిడివి గల ప్రత్యేక వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక గమ్యస్థానాలను ప్రపంచానికి పరిచయం చేశారు. భవిష్యత్ అంతా పర్యాటకానిదే అని ఆకాంక్షించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌ల ఆశయాలకు ఈ నివేదిక మరింత బలాన్ని చేకూర్చింది.
ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించేందుకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అత్యంత అనువైన సమయమని పేర్కొన్న నీతి ఆయోగ్, ఏయే నెలల్లో ఏ ప్రాంతాలను సందర్శించాలో విపులంగా వివరించింది. కూచిపూడి, విలాసిని నాట్యాల వంటి సంప్రదాయ కళలకు ఏపీ కేంద్రమని, ఇక్కడి ఆత్మీయ ఆతిథ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుందని అభివర్ణించింది. రాష్ట్రంలోని ప్రకృతి ప్రాంతాలు, ప్రసిద్ధ చారిత్రక కట్టడాలు, పురాతన కోటలు, సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహలు, విశాల సముద్రతీరం, అద్యాత్మిక ప్రాంతాలు, ప్రఖ్యాతి గాంచిన స్థానిక వంటకాలు, సంప్రదాయ వస్త్రాలు, హస్త కళాకృతులు, బౌద్ధారామాలు, పర్యాటక ఉత్సవాలు, ఘనమైన వారసత్వం తదితర విశేషాలను నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొన్నది.
నివేదికలో ప్రస్తావించిన ప్రధాన పర్యాటక ప్రాంతాలు:
ప్రకృతి ఒడిలో: అరకు వ్యాలీ, లంబసింగి, మారేడుమిల్లి, పాపికొండలు, కురుపాం అటవీ ప్రాంతాలు, దట్టమైన నల్లమల్ల అడవులు, హార్సిలీ హిల్స్, కొల్లేరు, పులికాట్ సరస్సు మరియు అందమైన కోనసీమ.
జలపాతాలు & రిజర్వాయర్లు: కొత్తపల్లి, రంప, తలకోన, ఎత్తిపోతల జలపాతాలు, కంభం చెరువు, అనకాపల్లి కోనం మరియు తాటిపూడి రిజర్వాయర్లు.
వన్యప్రాణి సంరక్షణ: కంబాలకొండ, కోరింగ మడ అడవులు, నేలపట్టు మరియు ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రాలు.
చారిత్రక & సాహస యాత్రలు: బొర్రా గుహలు, బెలూం గుహలు, ఉండవల్లి, మొగల్రాజపురం, ఉదయగిరి గుహలు. గండికోట (గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా), కొండపల్లి కోట, చంద్రగిరి మరియు గుత్తి కోటలు.
తీర ప్రాంత సౌందర్యం: రుషికొండ, సూర్యలంక, కొత్తపట్నం బీచ్‌లు, ఎర్రమట్టి దిబ్బలు, కాకినాడ హోప్ ఐల్యాండ్ మరియు గిన్నీస్ రికార్డులో నిలిచిన 5 శతాబ్దాల నాటి తిమ్మమ్మ మర్రిమాను.
ఆధ్యాత్మిక వైభవం: తిరుమల వేంకటేశ్వరస్వామి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విశాఖ అప్పికొండ శ్రీ సోమేశ్వర ఆలయం, పాలకొల్లు క్షీరారామ క్షేత్రం, మహానంది, యాగంటి, పరిటాల ఆంజనేయ స్వామి, రామతీర్థం, శ్రీముఖ లింగం.
వారసత్వ కట్టడాలు: లేపాక్షి ఆలయం, అమరావతి మహాచైత్యం, బావికొండ బౌద్ధ స్మారకాలు, కడప పెద్ద దర్గా, నెల్లూరు బారా షాహిద్ దర్గా, గుంటూరు జేఎం బాప్టిస్ట్ చర్చి మరియు చేబ్రోలు చర్చిలు.
ప్రత్యేక ఆకర్షణలు: రాజమహేంద్రవరం రైల్వే వంతెన, కోనసీమ దిండి, కృష్ణా నది, వేంకటేశ్వర నేషనల్ పార్క్, ఓర్వకల్లు రాక్ గార్డెన్ మరియు కదిరి క్షేత్రం.
సంస్కృతి – రుచులు – కళలు:
రుచులు: పులిహోర, పూతరేకులు, కాజా, పెసరట్టు, గోంగూర పచ్చడి, ఉలవచారు, బొబ్బట్లు, రాగి సంగటి, ఆంధ్రా చికెన్ కర్రీ, చేపల పులుసు, గుత్తి వంకాయ మరియు అరిసెలు.
ఉత్సవాలు: తిరుమల బ్రహ్మోత్సవాలు, లేపాక్షి, విశాఖ, లుంబిని ఉత్సవాలు, కోనసీమ సంక్రాంతి సంబురాలు, ఫ్లెమింగో ఫెస్టివల్ మరియు దక్షిణ హస్త కళా మేళా.
వస్త్రాలు & హస్తకళలు: మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ జామ్దానీ, కలంకారీ చీరలు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, నరసాపురం లేస్ మరియు బుడితి మెటల్ క్రాఫ్ట్స్.
ఇవే గాక మరిన్ని పర్యాటక ప్రాంతాలు, ఇతర అంశాలకు జాబితాలో చోటు దక్కింది..
పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ హర్షం:
ఈ సందర్భంగా పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “ముచ్చటైన ముక్కోణపు పాలనలో ప్రపంచ పర్యాటక చిత్రపటంపై ఏపీ వైభవం వెలుగుతోంది. నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్న ప్రతి ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం. ఏపీలోని ప్రతి జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటికి విశేష ప్రాచుర్యం కల్పిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైంది. 2030 నాటికి భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీని నిలుపుతాం. కొత్త పర్యాటక పాలసీ,పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా,అనుబంధ పాలసీలు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలతో పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారుతుంది. సందర్శించండి స్వర్ణాంధ్రను.. ఆస్వాదించండి అడుగడుగునా ఆత్మీయ ఆతిథ్యాన్ని!” అని మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News