-జిల్లాలో 48 బ్లాక్ స్పాట్ల ను గుర్తించి – 60 రోజుల్లో సవరణ చర్యలు
-రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీరో డెత్ పాలసీ లక్ష్యంగా వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో అన్ని బ్లాక్ స్పాట్లను 100 శాతం సరిదిద్దే చర్యలు తీసుకుంటాం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
-వాహనదారులు స్వయంగా క్రమశిక్షణతో ఉండి, ఓవర్ స్పీడ్ చేయకుండా, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయి.
-జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమంగా ప్రత్యేక బస్సు యాత్రను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
మంగళవారం ఉదయం శిల్పారామం నందు రోడ్డు భద్రత – బస్సుయాత్ర పై జిల్లా ఎస్పీ, ఆర్ అండ్ బి, రవాణా శాఖ, నేషనల్ హైవే సంబంధిత కలిసి విలేకరుల సమావేశంలో నిర్వహించారు.
ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ముందున్నాయని చెప్పారు. తిరుపతి జిల్లాలో సగటున ప్రతి సంవత్సరం 550 నుంచి 560 మంది వరకు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ, తిరుమల దర్శనానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రాక, లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు, ఓవర్ స్పీడింగ్, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం లోపం, సిగ్నల్ జంపింగ్, లేన్ క్రాసింగ్ వంటి కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని అన్నారు.
గత సంవత్సరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాణాంతక లేదా తీవ్ర ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ఈ ప్రాంతాలను పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, ఆర్ & బి, పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి రెండు బస్సుల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతి బ్లాక్ స్పాట్ వద్ద ప్రమాదాలకు దారితీసే స్ట్రక్చరల్ లోపాలు, రహదారి సమస్యలు, స్థానిక పరిస్థితులు విశ్లేషించి, స్థానిక ప్రజలు, వ్యాపారులు, నివాసితుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. తాత్కాలిక మరియు శాశ్వత చర్యలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన అమలు చేయనున్నట్లు తెలిపారు.
గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీరో డెత్ పాలసీ లక్ష్యంగా వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో అన్ని బ్లాక్ స్పాట్లను 100 శాతం సరిదిద్దే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా బ్లింకర్స్, రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, ట్రాఫిక్ సిగ్నలింగ్ వంటి భద్రతా చర్యలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లాంగ్ డిస్టెన్స్ ప్రయాణికుల కోసం జాతీయ రహదారుల వెంట తగిన రెస్ట్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్ నియంత్రణకు ఆల్కహాల్ మీటర్లు, స్పీడ్ గన్స్ వినియోగాన్ని పెంచుతున్నామని చెప్పారు.
రాత్రి వేళల్లో అనధికారిక ప్రదేశాల్లో భారీ వాహనాలను నిలిపివేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో, ట్రక్కులను నిర్దేశిత ట్రక్ బే లైన్లలో మాత్రమే నిలిపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ బస్సు యాత్ర అనంతరం 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేసి ప్రమాదాలను గణనీయంగా తగ్గించే దిశగా జిల్లా యంత్రాంగం, ఎస్పీ మరియు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మాట్లాడుతూ… తిరుపతి జిల్లాలో రహదారి భద్రతను బలోపేతం చేయడానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఒకవైపు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పాల్గొంటూ, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి ప్రాంతంలో తక్షణం తీసుకోవాల్సిన తాత్కాలిక చర్యలు, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన శాశ్వత పరిష్కారాలను గుర్తిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ సూచించిన 50 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తాత్కాలిక పరిష్కారాలను వెంటనే అమలు చేసి, శాశ్వత పరిష్కారాల కోసం జాతీయ రహదారి సంస్థలతో చర్చలు జరిపి అండర్‌పాసులు, బ్లింకర్లు వంటి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో కేవలం పోలీస్ శాఖ చట్ట అమలు మాత్రమే సరిపోదని, ప్రజల్లో అవగాహన పెంపొందించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. వాహనదారులు స్వయంగా క్రమశిక్షణతో ఉండి, ఓవర్ స్పీడ్ చేయకుండా, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా రహదారి ఇంజనీరింగ్ పరంగా సరైన సూచికలు, వేగ నియంత్రణ పరికరాలు, దిశా నిర్దేశక బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు.
తిరుపతి జిల్లాకు వచ్చే భక్తులు, స్థానిక ప్రజలు అందరూ రహదారి భద్రతపై అప్రమత్తంగా ఉండి, అనవసర ప్రాణ నష్టాలను నివారించేందుకు అధికారులు, మీడియా, ప్రజలు కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, పోలీస్ శాఖ, రవాణా శాఖ, పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి నేషనల్ హైవే వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News