– స్వీయ గణన ప్రక్రియలో భాగస్వాములుకండి
– అందుబాటులో https://se.census.gov.in పోర్టల్
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో మొట్టమొదటి డిజిటల్ జన గణన తొలిదశలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్ – ఎస్ఈ)లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ ఇంటి నుంచే సమాచారాన్ని నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు. ఈ నెల 16 నుంచి స్వీయ గణన జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీశ బుధవారం ఎ.కొండూరులోని చైతన్యనగర్ తండాలో ప్రక్రియను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, ఉపాధి హామీ శ్రామికులకు స్వీయ గణనపై అవగాహన కల్పించి, ప్రక్రియలో భాగస్వాములను చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కచ్చితమైన డేటాతో పాటు కీలకమైన జనగణనలో విస్తృత ప్రజాభాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. https://se.census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను పొందుపరుచుకోవచ్చన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ వల్ల సమయం ఆదా అవడంతో పాటు కచ్చితమైన డేటా పొందేందుకు వీలుంటుందన్నారు. 34 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిన అనంతరం ప్రివ్యూ చేసుకొని, ఫైనల్‌గా సబ్‌మిట్ చేయాలన్నారు. ఆ సమయంలో 11 అంకెల విశిష్ట సంఖ్య (ఎస్ఈ ఐడీ) జనరేట్ అవుతుందని.. భవిష్యత్తులో గణాంక సిబ్బంది (ఎన్యూమరేటర్) వచ్చినప్పుడు ఎస్ఈ ఐడీని వారికి చూపించడం ద్వారా డేటా ధ్రువీకరణ పూర్తవుతుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ఈ నెల 30 వరకు 15 రోజుల అవుట్‌రీచ్ క్యాంపయిన్‌లో భాగంగా ఒక్కోరోజు ఒక్కో వర్గం లక్ష్యంగా స్వీయ గణనపై ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి మొక్కలు నాటే క్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News