-ప్రతి బస్టాప్‌లో బస్సులు తప్పనిసరిగా ఆపాలని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు ఆదేశం
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం శాంతి థియేటర్ సమీపంలో బస్సు షెల్టర్ లేకపోవడం, అలాగే బస్సులు నిర్దిష్ట బస్టాప్‌లలో ఆగకపోవడం వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తక్షణమే స్పందించారు. ఇటీవల వచ్చిన వార్త కథనాలను పరిగణనలోకి తీసుకున్న ఆయన, అన్ని బస్టాప్‌లలో బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గన్నవరం డిపో మేనేజర్ శివాజీ ప్రతిరోజు డ్రైవర్లు, కండక్టర్లకు గేట్ మీటింగ్‌లు నిర్వహిస్తూ ప్రతి బస్టాప్‌లో బస్సులు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, వారు కోరిన స్టాప్‌లలో దింపాలని, ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ఫిర్యాదులు వచ్చిన డ్రైవర్లు, కండక్టర్లను ప్రత్యేక శిక్షణకు పంపిస్తూ, అవసరమైతే వ్యక్తిగతంగా పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ప్రతిరోజు రూట్లలో పర్యటిస్తూ అన్ని స్టేజీలలో బస్సులు ఆగేలా పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు డిపో మేనేజర్ శివాజీ వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News