-పట్టణ ప్రజల కల సాకారం!!..
-నాణ్యమైన విద్యకు నూతన ద్వారం!..
-త్వరలో ఐదు ఎకరాల్లో శాశ్వత భవనాలకు శ్రీకారం
-జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
మదనపల్లి పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం కావడం గర్వకారణమని, దీని ద్వారా పట్టణ వాసుల ఎన్నో సంవత్సరాల కల నెరవేరిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ స్థాయి విద్యాసంస్థ మదనపల్లిలో ఏర్పాటు కావడం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందన్నారు.
బుధవారం మదనపల్లి పట్టణంలోని వలసపల్లిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల బ్యాండ్ మేళంతో కలెక్టర్కు స్వాగతం పలికారు. అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులు పుష్పగుచ్చాలతో ఆత్మీయ ఆహ్వానం అందించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను కలెక్టర్ ఆసక్తిగా పరిశీలించారు. క్లాస్ వన్ గదిని ఒక విద్యార్థితో కలిసి ప్రారంభించి విద్యా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఘన చరిత్ర కలిగిన మదనపల్లిలో కేంద్రీయ విద్యాలయం స్థాపన ఎంతో విశేషమని అన్నారు. అనేక అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి విద్యాలయం ప్రారంభం కావడం శుభ పరిణామమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, వారి మార్గదర్శకత్వంలో కేంద్రీయ విద్యాలయం స్థాపన త్వరితగతిన సాధ్యమైందన్నారు. మంజూరైన ఈ విద్యాసంస్థ ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రారంభం కావడానికి ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ జరిపిందని చెప్పారు.
ఈ విద్యాలయం ద్వారా నాణ్యమైన, ఆధునిక విద్య అందుబాటులోకి రావడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. ప్రభుత్వం విద్యాలయం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, త్వరలోనే శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఆధునిక తరగతి గదులు, ల్యాబొరేటరీలు, క్రీడా మైదానం వంటి అన్ని సౌకర్యాలతో విద్యాలయాన్ని అభివృద్ధి చేయడంపై జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టేలా చర్యలు వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
ఈ విద్యాలయం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వృత్తులలో పనిచేసే కుటుంబాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మెరుగైన విద్య అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే అడ్మిషన్ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేసి, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు.
కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… విద్యాలయం స్థాపనలో జిల్లా కలెక్టర్ అందించిన సహకారం అమూల్యమని తెలిపారు. ఆయన చొరవతో ప్రభుత్వ అనుమతులు త్వరితగతిన లభించాయని, భవన నిర్మాణానికి స్థల కేటాయింపు కూడా సాధ్యమైందని పేర్కొన్నారు. అడ్మిషన్ ప్రక్రియను కలెక్టర్ నియమించిన కమిటీ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాల విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తారని తెలిపారు.
అనంతరం పాఠశాల ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ మొక్క నాటారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనురాధ, డిప్యూటీ డిఇఓ లోకేశ్వర్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News