-‘మెగా కౌన్సెలింగ్ – పరివర్తన సదస్సు’తో నిందితుల్లో మార్పు దిశగా అడుగు
-జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
-జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని, సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. మహిళలకు భద్రమైన, సురక్షితమైన సమాజ నిర్మాణం అందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.
అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో “మెగా కౌన్సెలింగ్ – పోలీసు పరివర్తన సదస్సు” ఘనంగా నిర్వహించారు. మహిళలపై నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించి విడుదలైన నిందితుల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరై నిందితులకు మార్గనిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… క్షణికావేశం, చెడు అలవాట్లు, వ్యసనాల కారణంగా చేసే తప్పులు జీవితాలను చీకటిలోకి నెట్టేస్తాయని హెచ్చరించారు. అలాంటి తప్పుల వల్ల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని, సమాజంలో గౌరవం కోల్పోతారని పేర్కొన్నారు. గతాన్ని వదిలి, బాధ్యతాయుతమైన పౌరులుగా కొత్త జీవితం ప్రారంభించాలని సూచించారు. మహిళలపై వేధింపులు, సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు, ఫోటో మార్ఫింగ్, మోసాలు వంటి చర్యలపై కఠిన నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలపై నేరాలను పూర్తిగా నిర్మూలించే దిశగా జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ… మహిళల భద్రత పోలీస్ శాఖకు అత్యున్నత ప్రాధాన్యత అని తెలిపారు. అత్యాచారాలు, హత్యలు, బాలలపై అఘాయిత్యాలు, వేధింపులు, కట్నం వేధింపులు వంటి కేసుల్లో పాల్గొన్న నిందితులందరినీ ఒకేచోట చేర్చి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జైలు నుంచి విడుదలైన వారి కదలికలపై, రౌడీ షీటర్లపై 24/7 పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. సచివాలయ పోలీసులు, ‘శక్తి’ బృందాల ద్వారా 360 డిగ్రీల నిఘా ఉంచుతున్నామని వెల్లడించారు. మళ్లీ నేరాలకు పాల్పడితే ‘పీడీ యాక్ట్’ వంటి కఠిన చట్టాలు అమలు చేస్తామని గట్టిగా హెచ్చరించారు.
తగ్గిన నేరాలు – పెరిగిన శిక్షలు:
అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి మాట్లాడుతూ… పోలీసుల కఠిన చర్యల ఫలితంగా జిల్లాలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. 2023లో 636 కేసులు నమోదు కాగా, 2025లో అవి 579కు తగ్గినట్లు వెల్లడించారు. గత రెండు సంవత్సరాల్లో 19 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు సహా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
కార్యక్రమం ముగింపు సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జి. శంకర మల్లయ్య ఆధ్వర్యంలో నిందితులందరూ “మహిళలను గౌరవంగా చూసుకుంటాం”అంటూ ప్రతిజ్ఞ చేశారు. తాము పూర్తిగా మారుతామని, ఇతరులను కూడా నేరాల నుంచి దూరం పెట్టేందుకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ బి. పావని, పోలీసు శాఖ సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News