విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి.కామేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం విఎంసి కాలనీ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి. కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో పూడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటున్నారని, ట్రాక్టర్ మెషిన్ తో బోట్ల సహాయంతో సిబ్బంది కాలువల్లో పర్యటించి గుర్రపుడెక్కలను, వ్యర్ధాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్లలేని చోట డ్రోన్ ని పంపించి ఎంఎల్ ఆయిల్స్ స్ప్రే చేసి దోమల లార్వా ఉత్పన్నమవుకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్, స్ప్రేయింగ్, మరి కొన్నిచోట్ల దోమల లార్వాని తినే గంబోజియా చాపలను విడుదల చేస్తూ నగరంలో దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి ఇంట్లో దోమలు ఉత్పన్నం అవ్వకుండా డ్రైడే పాటించాలని అది ప్రతి శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవని అన్నారు. ప్రతి శుక్రవారం తమ ఇంట్లో మరియు ఇంటి చుట్టు పరిసరాలలో ఎక్కడ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా తొట్లు, వాడుక లేని బకెట్లు, మగ్గులు, డ్రమ్ములు, పూల కుండీలు, అలా ఏ వస్తువు అయినా వాడుకంలో లేనివి అందులో నీటి నిల్వ ఉండే అవకాశం ఉన్నవి, ప్రతి శుక్రవారం వాటిని గమనించి ఆ నిల్వ ఉన్న నీరుని పారవేస్తే ఇంట్లో దోమల సమస్య తగ్గుతుందని అన్నారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు వారి ఇంటి వద్దకు వెళ్లి నీటి నిల్వలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కడ ఉన్నాయని చూపించి, వాటిని పారేస్తే అందులో లార్వా చచ్చిపోతుందని వారికి అవగాహన కల్పించి ప్రతి శుక్రవారం దీన్ని పాటిస్తే దోమలను శాశ్వతంగా నియంత్రించవచ్చని వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బయాలజిస్ట్ తో పాటు సానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు మలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News