-ఆ రూల్ నుంచి విముక్తి, ఇకపై అర్ధరాత్రి వెళ్లి ఫోటోలు తీయక్కర్లేదు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్ పోలీసులకు ఊరట దక్కింది.. బార్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేసే నిబంధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు
ఎక్సైజ్ పోలీసులు ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటల తర్వాత బార్లు మూసేశారని నిర్థారించాల్సి ఉంది. ఎక్సైజ్ కానిస్టేబుళ్లు బార్లు మూసివేసినట్లు ఫోటోలను తీసి ఎక్సైజ్ ఐ యాప్‌లో అప్లోడ్ చేసేవారు. అయితే ఇకపై ఆ నిబంధనను సడలించినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇకపై ఎక్సైజ్ కానిస్టేబుళ్లు సీసీ కెమెరాల వీడియోలు కానీ, బార్లో పనిచేసేవారికి వీడియో కాల్ చేసి కానీ నిబంధనలకు అనుగుణంగా బార్ మూసివేసినట్లు నిర్థారించుకోవచ్చని తెలిపింది.
రాష్ట్రంలోని మద్యం షాపులు, బార్లు ప్రతి రోజూ ఓపెన్ చేసే ముందు, రాత్రి మూసివేసే వరకు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు వీటి ఫోటోలను తీసి ఎక్సైజ్ ఐ యాప్‌లో అప్లోడ్ చేయాలనే నిబంధన ఉంది. అయితే అర్ధరాత్రి 12 గంటలకు బార్లు మూసివేస్తారు కాబట్టి ఆ సమయంలో వెళ్లి ఫోటోలు తీయడం కానిస్టేబుళ్లకు ఇబ్బందిగా మారింది. శుక్రవారం రోజు విశాఖపట్నం జిల్లాలో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ సింహాచలం నాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సింహాచలం నాయుడు బార్లు మూసివేసే సమయంలో వెళ్లి ఫోటోలు తీసి అప్లోడ్ చేసి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల వినతి మేరకు బార్లు మూసేసే సమయంలో నేరుగా వెళ్లి ఫొటోలు తీయాల్సిన అవసరం లేదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సింహాచలం నాయుడు కుటుంబానికి అండగా ఉంటామని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సింహాచలం నాయుడు కుటుంబానికి ఎక్సైజ్ శాఖ నుంచి రూ.10 లక్షలు వెంటనే అందించాలని మంత్రి ఆదేశించారు. అలాగే ఎస్బీఐ బీమా పథకం ద్వారా రూ1.10 కోట్లు ఆర్థిక సాయం వచ్చేలా చూస్తామన్నారు. హెడ్ కానిస్టేబుల్ కుటంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం (కారుణ్య నియామకం) ఇస్తామని ప్రకటించారు.
Prajavartha Online Telugu News