-తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడమే లక్ష్యం.
-కరువుప్రాంతాలకు ప్రయోజనం కల్గించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి.
-ఉత్తరాంధ్రప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న రెండేళ్లలో 2000 కోట్లు ఖర్చు చేసి ఉత్తరాంధ్రలో 11 కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించినట్లు జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు చెప్పారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కీలకమైన 11 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో 2.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ సాధ్యమౌతుందని ఆయన చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడంతో పాటు, కరువుప్రాంతాలకు ప్రయోజనం కల్గించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వివరించారు.
వంశధార ట్రిబ్యునల్ 2021 తీర్పును గెజిట్ లో చేర్చుతూ నోటిఫికేషన్ ఇవ్వడంలో చంద్రబాబు కృషి ఫలించిందన్నారు. పలుమార్లు ఢిల్లీ వెళ్ళి కేంద్రజలశక్తి శాఖ మంత్రిని కలసి ఒడిశాతో ఉన్న వివాదంపై, ప్రాజెక్టు అవశ్యకతను వివరించడంతో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని నిమ్మల సంతోషం వ్యక్తం చేశారు.
గత 5ఏళ్ళ వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంద్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో కీలకమైన పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను సైతం జగన్ నిలిపేసి ఈప్రాంతానికి తీవ్ర ద్రోహం చేశాడని దుయ్యబట్టారు. ఈసమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఉత్తరాంధ్ర సిఈ, ఎస్ఈ లు, ఈఈ లు, ఇతర అధికారులు, మరియు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News