– 9 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్
– వర్షాల హెచ్చరిక మధ్య పంట రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు… అధికారులకు మంత్రి ఆదేశాలు
– హార్వెస్టర్లకు డీజిల్ ప్రాధాన్యం… రైతులకు నష్టం లేకుండా సమగ్ర చర్యలు
– అధిక డిమాండ్ జిల్లాల్లో అదనపు ట్యాంకర్లు, సరఫరా అంతరాయం ఉండకూడదని మంత్రి స్పష్టం
– ఫీల్డ్‌లో అధికారులు తప్పనిసరి… రైతులకు సకాలంలో గైడెన్స్ ఇవ్వాలి
– డీజిల్ సరఫరా, పంట రక్షణపై ప్రభుత్వం పూర్తి దృష్టి – మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రబీ సీజన్ వరి పంట కోతలు, డీజిల్ సరఫరా, వాతావరణ పరిస్థితులపై 9 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం వరి కోతలు అత్యంత కీలక దశలో కొనసాగుతున్న నేపథ్యంలో కంబైన్ హార్వెస్టర్లకు డీజిల్ సరఫరా ఎక్కడా అంతరాయం కలగకుండా నిరంతరంగా కొనసాగించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా సమీక్షించినప్పుడు ఉభయ గోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కోతలు పెద్ద ఎత్తున జరుగుతున్నందున డీజిల్ అవసరం అధికంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్నందున అదనపు ట్యాంకర్ల ద్వారా సరఫరా పెంచాలని సూచించారు. మరోవైపు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కోతలు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు.
ఫీల్డ్ స్థాయిలో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు పెరగడం, ట్యాంకర్ల సరఫరా ఆలస్యం, జిల్లాల మధ్య హార్వెస్టర్ల మార్పిడి వల్ల అకస్మాత్తుగా డీజిల్ డిమాండ్ పెరుగుతున్నట్లు గుర్తించామని మంత్రి చెప్పారు. ఈ పరిస్థితుల్లో అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు అదనపు ట్యాంకర్లను పంపించడం, ముఖ్యమైన పెట్రోల్ బంకుల్లో ముందస్తు నిల్వలు ఏర్పాటు చేయడం, హార్వెస్టర్లకు ప్రత్యేక క్యూ , టోకెన్ వ్యవస్థ అమలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ డీజిల్ సరఫరా కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదే సమయంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుని వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. కోతకు వచ్చిన వరి తడిసిపోకుండా రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలని, అన్ని అగ్రికల్చర్ అధికారులు ఫీల్డ్‌లో అందుబాటులో ఉండి రైతులను సకాలంలో గైడ్ చేయాలని ఆదేశించారు. సివిల్ సప్లైస్ శాఖతో సమన్వయం పెంచి అవసరమైన టార్పాలిన్ పట్టాలను తక్షణం సరఫరా చేయాలని, బ్యాంక్ గ్యారెంటీ 1:3 విధానంలో సహకారం అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్లు ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఎక్కడా డీజిల్ సరఫరా నిలిచిపోకుండా చూడాలని మంత్రి సూచించారు.
ప్రతి జిల్లాలో రోజువారీగా పరిస్థితిని సమీక్షిస్తూ ఎక్కడైనా లోపం ఉంటే వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే 2–3 వారాలు అత్యంత కీలకమైన కాలమని, ఈ సమయంలో ఎక్కడా కోతలు ఆగకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా డీజిల్ సరఫరా మరియు పంట రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.
Prajavartha Online Telugu News