-ఇసుక సరఫరా విధానాన్ని పారదర్శకంగా అమలు చేయండి..
-నిబంధనలు ఉల్లంగించకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయండి..
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇసుక సరఫరాను మరింత సులభతరం చేసేందుకు జిల్లాలో మరో ఐదు ఇసుక రీచ్‌లకు టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఇసుక సరఫరా విధానాన్ని పారదర్శంగా అమలు చేయడంతో పాటు నిబంధనలను ఉల్లంగించకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇసుక సరఫరా అమలుపై బుధవారం కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇసుక, పట్టా భూముల్లో ఇసుక తొలగింపుకు, కొత్త రీచ్‌లకు సంబంధించి అనుమతుల ప్రక్రియ, ఇసుక అక్రమ రవాణా జరగకుండా తీసుకుంటున్న చర్యల పై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా పరిధిలో తొమ్మిది రీచ్‌ల ద్వారా ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. కృష్ణా, మున్నేరు పరిధిలో జగ్గయ్యపేట మండలంలో రెండు చందర్లపాడు మండలంలో రెండు, కంచికచెర్ల మండలంలో 3 కొత్త రీచ్‌లకు సంబంధించిన టెండర్లు ఖరారు కాలేదని తిరిగి టెండర్లు పిలిచే ప్రక్రియను చేపట్టాలని సూచించారు. పట్టా భూముల్లో మేట వేసిన ఇసుక తొలగింపునకు రైతులకు అనుమతి ఇచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా పోలీసు శాఖ సహకారంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని.. అక్రమ రవాణాకు పాల్పొడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇసుక విధానం అమలుకు సంబంధించి ఐవీఆరఎస్ ద్వారా ప్రజల సంతృప్తి స్థాయి వ్యక్తం చేశారని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు.
సమావేశంలో మైన్స్ డీడీ శ్రీనివాస్ కుమార్, ఏడీ కె. వీరస్వామి, డిపివో లావణ్య కుమారి, డిటిసి ఎం పురేంద్ర, కెసి డివిజన్ ఇఇ రవి కిరణ్, నందిగామ ఆర్‌డివో కె. పొసిబాబు సమన్వయ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News