విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాధ్యతల నిర్వహణలో మాత్రమే కాకుండా, అచెంచల నిబద్ధతకు, ఉన్నతమైన వృత్తి నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ, సౌత్ సెంట్రల్ రైల్వేశాఖ ప్రతిష్టను మరింతగా పెంపొందించే వారిలో కీలక పాత్ర పోషించినవారు నిమ్మకాయల వెంకటరమణ. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని అంచెంచెలుగా ఎదుగుతూ అజాతశత్రువుగా నిలిచిన వ్యక్తి ఈయన. ఇండియాలో ప్రతిష్టాత్మకమైన వందేభారత్ నడిపిన ప్రతిభాశాలిగా అనితర సాధ్యమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అవిశ్రాంతంగా రైల్వేలో ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది తద్వారా ఎందరికో గురువుగా, మార్గదర్శకంగా నిలిచిన ప్రతిభాశాలి. వాటిలో ఈటిటిసిలో అధ్యాపక పదవి చేపట్టి ఎందరికో విద్యను అందించి మా మాష్టారు మంచి వారు అందరి హృదయాలలో నిలిచిపోయారు. లోకో పైలెట్ గా విలువల కట్టలేని సేవలను అందించి ప్రతిభను చాటుకున్నారు. 38 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో వేలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చిన ఘనత ఈయనది. ఈయన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు ఎన్నో చూశారు. వృత్తిధర్మంలో ఎన్నో రాష్ట్రాలలో ఎందరో అభిమానాన్ని చూరగొన్నారనడానికి నిదర్శనం ఆత్మీయ పదవీ విరమణ సమావేశానికి హాజరైన యువకులు, మధ్యవయస్సువారు కుటుంబ సభ్యులతో హాజరై అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి అన్ని యూనియన్ల నాయకులు, సభ్యులు హాజరై ఆయన సేవలను ప్రతిఒక్కరూ ఆదర్శకంగా తీసుకొవాలన్నారు.
అనంతరం నిమ్మకాయల వెంకటరమణ దంపతులను అభినందించారు.
ఈ సందర్భంగా నిమ్మకాయల వెంకటరమణ మాట్లాడుతూ తన నిరంతర ప్రయాణంలో తనకు సహకరించిన సహ ఉద్యోగులు, అధికారులకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. తన వృత్తిలో వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ప్రయాణీకులను క్షేమంగా గమ్యస్థానంగా చేర్చడమే బాధ్యతగా నిర్వర్తించానని ఇది తన అదృష్టంగా భావించానన్నారు. అనంతరం సహా ఉద్యోగులు శాలువ కప్పి, పూలమాలతో, జ్ఞాపికలను అందజేసి సత్కరించి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News