– విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరాన్ని మరింత పచ్చదనంతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విజయవాడ నగరపాలక సంస్థ కీలక చర్యలు చేపడుతోంది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పౌరులకు ఉచితంగా పూల మొక్కలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం వెటర్నరీ కాలనీ పార్క్, నాగార్జున పార్క్, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, ఎంజీ రోడ్ మరియు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించబడింది. ఈ పంపిణీ కార్యక్రమానికి నగర ప్రజలు ఉత్సాహంగా స్పందించి పెద్ద ఎత్తున మొక్కలను స్వీకరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి “హరిత ఆంధ్రప్రదేశ్” లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకురావడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కమిషనర్ ధ్యానచంద్ర మార్గదర్శకత్వంలో పదివేల పూల మొక్కలను నగర ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నామని చెప్పారు.
Prajavartha Online Telugu News