-యువతకు ఉద్యోగ–ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం
-రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
పామర్రు/మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.
ఉదయం 7 గంటలకే కారకంపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, అవ్వాతాతలను పలకరిస్తూ, వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులు, గ్రామ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకే రోజు పెన్షన్ పెంపు నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా సామాజిక పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ.1,000 పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకుందని, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు, దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు, మంచానికే పరిమితమైన వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేల, రూ.15 వేల వరకు పింఛన్లు పెంచి అందిస్తున్నామని తెలిపారు.
పేదల ముఖాల్లో చిరునవ్వు చూడడమే తమ ప్రభుత్వానికి సంతృప్తినిస్తోందని పేర్కొన్నారు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ పథకం అమలు చేస్తున్నామని, సుమారు 17 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రపంచ దిగ్గజ సంస్థలు సుమారు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టగా, దాని ద్వారా 7 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ పంపిణీ, రైతులకు అన్నదాత సుఖీభవ, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తెలిపారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు నూతన విద్యా విధానం ద్వారా విద్యాభివృద్ధి, పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి ఏడాదికి సుమారు రూ.42 వేల విలువైన ప్రయోజనాలు అందిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందని మంత్రి కొలుసు పార్ధ సారథి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, కొలుసు నితిన్ కృష్ణ, గ్రామ సర్పంచ్ ఎన్. సునిల్ కుమార్ వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, సామాజిక పింఛన్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News