Breaking News

“టెలీ మానస్’ కేంద్రాలతో మానసిక రోగులకు స్వాంతన

-“14416” హెల్ప్ లైన్ కు మహిళల నుంచి అత్యధిక కాల్స్
-విజయవాడ, విశాఖలోని టెలీ మానస్ కేంద్రాల ద్వారా 365 రోజులు 24 గంటల సేవలు!
-మంత్రి సత్యకుమార్ సమీక్ష
-ప్రతి కాల్ ను సీరియస్ గా తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనతో ఉన్న వారు ‘టెలీ మానస్’ (హెల్ప్ లైన్ నెంబరు-14416) కేంద్రాల ద్వారా స్వాంతన పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల పటిష్టమైన ఈ కేంద్రాల ద్వారా నెలకు సుమారు 3వేల మంది సలహాలు, సూచనలు, పొందుతున్నారు. ఆత్మహత్య ప్రయత్నాలను విరమించుకుంటున్నారు. మానసిక కుoగుబాటు, ఉద్వేగాల నుంచి బయటపడుతున్నారు.
14416 ఉచిత హెల్ప్ లైన్ ద్వారా 365 రోజులు 24 గంటలూ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కౌన్సెలర్లు ఉంటున్నారు. పరీక్షల సమయంలో కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. విద్యార్థుల విషయంలో కౌన్సెలర్స్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆందోళనలతో ఫోను చేసే వారికి ధైర్యం చెబుతూ మార్పు తెస్తున్నారు.

ముఖ్యంగా విశాఖపట్టణం, కర్నూలు, గుంటూరు, నంద్యాల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి అత్యధికంగా హెల్ప్ లైన్ కు కాల్స్ వస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, బాపట్ల పల్నాడు జిల్లాల నుంచి కాల్స్ తక్కువగా వస్తున్నాయి.
విజయవాడలోని బోధనాసుపత్రిలో విశాఖలోని మానసిక చికిత్సాలయంలో ఉన్న ‘టెలీ మానస్’ కేంద్రాల పనితీరు, ఇతర అంశాలపై మంత్రి శ్రీ సత్యకుమార్ సమీక్షించారు.

67వేల కాల్స్

విజయవాడలో అక్టోబర్, 2022లో, వైజాగ్ లో 2023లో టేలీ మనస్ సెంటర్స్ ఏర్పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నడుస్తున్న ఈ టెలీ మానస్ కేంద్రాలకు ఇప్పటివరకు 67,573 కాల్స్ వచ్చాయి. అక్టోబర్ 2022 నుంచి జూన్, 2024 మధ్య 31 వేలు, మిగిలిన కాల్స్ జులై, 2024 నుంచి 2026 ఏప్రిల్ మధ్య వచ్చాయి.

నియామకాల అనంతరం…

అక్టోబరు, 2025లో కొత్తగా 40 మంది కౌన్సెలర్లు, టెక్నికల్ కో-ఆర్డినేటర్, ఇతర సిబ్బంది నియామకంతో హెల్ప్ లైన్స్ మరింత పటిష్టమయ్యాయి. కాల్స్ పెరుగుతూ వస్తున్నాయి.
2025 అక్టోబర్లో 1,432, నవంబర్-2,032, డిసెంబర్-2,743, ఈ ఏడాది జనవరి-2,878, ఫిబ్రవరి-2,738, మార్చిలో 2,908, ఏప్రిల్ నెలలో కాల్స్ 3 వేలు దాటాయి. హెల్ప్ లైన్స్ పటిష్టం చేసాక కాల్స్ పెరుగుతున్నాయి.

వీడియో కాల్స్ కూడా…

కాల్ చేసే వారిలో మహిళలు 52% చొప్పున ఉంటున్నారు. ఎండీ సైక్రియాటిస్ట్ ఆధ్వర్యంలో కౌన్సెలర్లు ఫోన్లుచేసిన వారికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా ఎదుటి వారి అనుమతితో వీడియో కాల్స్ ద్వారా కూడా మానసిక సమస్యలతో ఉన్న వారికి సిబ్బంది స్వాంతన చేకూరుస్తున్నారు. ఈ కాల్స్ చేసే వారిలో నాలుగైదు సార్లు కౌన్సిలర్లతో మాట్లాడిన వారు ఉన్నారు. ఆందోళనలతో ఫోన్లుచేస్తున్న వారు సగటున 10 నుంచి 20 నిమిషాల వరకు కౌన్సెలర్లతో సంభాషిస్తున్నారు.

హెల్ప్ లైన్ నెంబరు కామన్ గా ఉన్నా..!

జాతీయ స్థాయిలో 14416 హెల్ప్ లైన్ కామన్ గానే ఉంది. అయితే ఏ రాష్ట్రం నుంచి ఫోన్ చేస్తే సదరు రాష్ట్రంలోని కాల్ సెంటర్లు ఫోన్ వెళ్తుంది. మాతృభాషలోనే మాట్లాడొచ్చు. రాష్ట్రంలో రెండు కేంద్రాలు ఉన్నాయి. సదరు వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు రెండు కేంద్రాల్లో ఎవరైతే ఖాళీగా ఉంటారో వారికి ఫోన్ వెళ్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని టెలీ మానస్ కేంద్రాలకు బెంగుళూరులోని నిమ్ హన్స్
( National Institute of Mental Health and Neurosciences) ‘అపెక్స్ బాడీ’గా ఉంది.

ఫోన్ నెంబరు కనిపించదు.!*

సలహాలు, సూచనల కోసం ఫోన్ చేసిన వారెవ్వరో కౌన్సెలర్లకు కూడా తెలియదని, ఫోన్ నెంబరు కనిపించదని, వివరాలు గోప్యంగా ఉంచుతున్నామని అధికారులు మంత్రికి వివరించారు. విజయవాడ టెలీ మానస్ కేంద్రంలోని ఎండీ సైక్రియాటిస్టు మాట్లాడుతూ కేంద్రానికి వచ్చే కాల్స్‌ ను విశ్లేషించగా మానసిక కుంగుబాటు, విచారంలో ఫోన్లుచేసే వారు 19.87%, ఉద్యోగ సమస్యలు, పరీక్షల భయంతో 19.20%, నిద్రలేమి సమస్యలతో 15.57%, రకరకాల ఆందోళనలు, భయాలతో 11.7%, మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారు దురాలవాట్లు మానుకోవడం కోసం కాల్స్ చేసే వారు 7.12% మంది చొప్పున ఉంటున్నారు. మిగిలిన వారు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారని పేర్కొన్నారు. ఫోన్లు చేసిన వారి పరిస్థితిని అంచనావేస్తూ తప్పని పరిస్థితుల్లో మందులను కూడా సిఫార్సు చేస్తున్నామని పేర్కొన్నారు. టెలీ మానస్ కేంద్రాలను సంప్రదించే సమయంలో ఆత్మహత్యలు చేసుకోవాలన్న ధోరణిలో ఉన్న వారిలో చాలా మంది కౌన్సెలింగ్ అనంతరం ఆ ప్రయత్నాలను విరమించుకున్నారని వివరించారు.

దేశ వ్యాప్తంగా 53 కేంద్రాలు

“దేశ వ్యాప్తంగా 53 టెలీ మానస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 19.7 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. ‘నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే’ ప్రకారం ప్రతి వంద మందిలో 10.06% మంది మానసిక రుగ్మతలతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రoలో మానసిక సమస్యలతో ఉన్న వారికి ఉపశమనం లభించేలా చేసేందుకు మాత్రమే టెలీ మానస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 365 రోజులు 24 గంటలూ అందుబాటులో ఉండే సిబ్బంది ద్వారా విలువైన సలహాలు, సూచనలు పొందాలి. ఫోను చేసిన వారిలో అవసరమైన వారిని వైద్యులను సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు” అని మంత్రి శ్రీ సత్యకుమార్ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *