– సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
– కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు 98 అర్జీలు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని, ప్రతి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ లక్ష్మీశ.. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 98 అర్జీలు రాగా.. వీటిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 29 అర్జీలు, రెవెన్యూకు సంబంధించి 21 అర్జీలు, పోలీసు శాఖకు 12, పంచాయతీరాజ్‌కు 9 అర్జీలు వచ్చాయి. డీఆర్డీఏకు 8, పౌర సరఫరాలు, ఏపీఎస్ ఆర్టీసీలకు మూడు చొప్పున, విద్య, విద్యుత్ శాఖలకు రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, రవాణా, బీసీ సంక్షేమం, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ, కార్మిక, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఆర్ అండ్ బీ శాఖలకు ఒక్కో అర్జీ వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాస్థాయి అధికారులు నిర్దేశ గడువులోగా అర్జీల పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని, అర్జీదారులకు సకాలంలో సమాచారం అందిస్తూ పారదర్శకత పాటించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News