-హైదరాబాద్ హజ్ క్యాంపు వద్ద వీడ్కోలు పలికిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు ఎంఏ షరీఫ్
-ఆధునిక వసతులు కల్పించిన ప్రభుత్వానికి హాజీల కృతజ్ఞతలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హైదరాబాద్ ఎంబార్కేషన్ కేంద్రం శంషాబాద్ విమానాశ్రయం నుండి 185 మంది ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యాత్రికులు హజ్ యాత్రకు సోమవారం బయలుదేరి వెళ్లారు. విడిది కేంద్రం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన హాజీల తరలింపు వాహనాలను మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు యమ్ఏ షరీఫ్, మైనారిటీ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్, హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాష, సభ్యులు, సీఈఓ గౌస్ పీర్ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు మొదటి విమానం, ఆ తర్వాత రెండు విమానాల్లో మొత్తం 185 మంది యాత్రికులు హజ్ కు బయలుదేరి వెళ్లినట్లు మైనారిటీ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన వసతి విడిది కేంద్రంలో ఆధునిక సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యాత్రికులకు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో మైనారిటీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు జరిగాయి. ఏపీ నుంచి 1202మంది యాత్రికులు హజ్ కు వెళ్లేందుకు హైదరాబాద్ ఎంబార్కేషన్ కేంద్రం ఎంపిక చేసుకోవడం జరిగిందని మంత్రి ఫరూక్ తెలిపారు. వీరందరూ ఈనెల 21వ తేదీ వరకు దశలు వారిగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర హజ్ యాత్రికులకు ఇతర రాష్ట్రాలలోని ఎంబార్కేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా విడిది వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విడిది, భోజన, ప్రార్థన వసతులతో పాటు వైద్య శిబిరాలు, కరెన్సీ మార్పిడి, వీసా పత్రాల పరిశీలన, బోర్డింగ్ పాసుల జారీ తదితర అంశాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా వారికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి విశదీకరించే ఏర్పాట్లు, సహాయ సహకారాల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.గత నెల 18,19 వ తేదీలలో విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం గన్నవరం విమానాశ్రయం నుంచి పవిత్ర హజ్ యాత్రకు 333 మంది యాత్రికులు వెళ్లిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఏంబార్కేషన్ కేంద్రం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి విడిది సౌకర్యాలు, పర్యవేక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా, ఘనంగా జరిగాయని హజ్ యాత్రకు వెళ్తున్న హాజీలు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News